అంతర్జాతీయ ఆర్థిక సంస్థ ప్రపంచ బ్యాంకు (World Bank) పాకిస్థాన్ విషయంలో ఒక కీలకమైన భౌగోళిక మార్పు చేసింది. దశాబ్దాలుగా దక్షిణాసియా (South Asia) ప్రాంతంలో భాగంగా ఉన్న పాకిస్థాన్‌ను ఆ గ్రూప్ నుంచి పూర్తిగా తొలగించింది. ఇకపై ఆ దేశాన్ని మిడిల్ ఈస్ట్ మరియు నార్త్ ఆఫ్రికా (MENA) ప్రాంతీయ బ్లాక్‌లో చేర్చినట్లు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.
కొత్తగా ‘MENAAP’ ప్రాంతం ఏర్పాటు
వరల్డ్ బ్యాంక్ వర్గాల సమాచారం ప్రకారం.. పాకిస్థాన్‌తో పాటు అఫ్గానిస్తాన్‌ను కూడా కలుపుకుని మిడిల్ ఈస్ట్, నార్త్ ఆఫ్రికా, అఫ్గానిస్తాన్, పాకిస్థాన్ (MENAAP) పేరుతో ఒక నూతన ప్రాంతీయ వర్గీకరణను రూపొందించారు. దీనితో ఇప్పుడు ‘దక్షిణాసియా’ (South Asia) గ్రూప్‌లో కేవలం భారత్, బంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్, భూటాన్ మరియు మాల్దీవులు మాత్రమే మిగిలాయి.
మార్పునకు గల అసలు కారణాలు ఏమిటి?
పాకిస్థాన్ గత కొంతకాలంగా తన విదేశాంగ విధానాన్ని దక్షిణాసియా దేశాల కంటే ఎక్కువగా పశ్చిమాసియా (Middle East) దేశాల వైపు మళ్లించింది. సౌదీ అరేబియా, ఖతార్, యూఏఈ వంటి గల్ఫ్ దేశాల నుంచి భారీగా అందుతున్న విదేశీ మారకద్రవ్యం (Remittances), ఎల్‌ఎన్‌జీ (LNG) దిగుమతులు, మరియు ఆ దేశాలతో ఏర్పడిన బలమైన ఆర్థిక, రక్షణ సంబంధాల కారణంగానే ప్రపంచ బ్యాంకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.
ఆర్థిక నిర్మాణం, పాలనా విధానాలు, జనాభా వృద్ధి మరియు అభివృద్ధి సవాళ్లు తదితర అంశాల పరంగా పాకిస్థాన్ పరిస్థితులు దక్షిణాసియా దేశాల కంటే మధ్య ప్రాచ్య (Middle East) దేశాలతో ఎక్కువగా పోలి ఉండటం వల్లనే ఈ రీక్లాసిఫికేషన్ చేపట్టినట్లు సమాచారం.