న్యూఢిల్లీ: భారతీయ ఆటోమొబైల్ మార్కెట్పై పట్టు సాధించేందుకు ప్రముఖ జర్మన్ కార్ల తయారీ సంస్థ ఫోక్స్‌వ్యాగన్ (Volkswagen) మరో కీలక అడుగు వేస్తోంది. భారత మార్కెట్లోకి రెండు కొత్త ఎలక్ట్రిక్ వాహనాలను (EVs) లాంచ్ చేయాలని ఆ సంస్థ యోచిస్తోంది. దేశీయ దిగ్గజమైన జేఎస్‌డబ్ల్యూ గ్రూప్‌తో కుదుర్చుకోబోతున్న ప్రత్యేక భాగస్వామ్యం (Alliance) ద్వారా ఈ ఎలక్ట్రిక్ కార్లను భారతీయ మార్కెట్లోకి తీసుకురానున్నట్లు సమాచారం.
జేఎస్‌డబ్ల్యూతో జాయింట్ వెంచర్
ఫోక్స్‌వ్యాగన్ గ్రూప్ మరియు జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ మధ్య 51:49 నిష్పత్తిలో ప్రతిపాదిత డీల్ కుదరనుంది. ఈ భాగస్వామ్యం ద్వారా భారత్‌లో కాంపోనెంట్ సోర్సింగ్, వాహనాల తయారీతో పాటు డీలర్ నెట్‌వర్క్‌ను మరింత విస్తరించనున్నారు. ఈ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని 2027 మధ్య నాటికి పూర్తిగా లాంఛనప్రాయం చేయాలని ఇరు కంపెనీలు భావిస్తున్నాయి.
స్కైడా (Škoda) మరియు ఫోక్స్‌వ్యాగన్ ఎలక్ట్రిక్ కార్లను కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ పద్ధతిలో అసెంబ్లీ చేయడానికి జేఎస్‌డబ్ల్యూ మోటార్స్‌కు చెందిన మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్ ప్లాంట్ లేదా గుజరాత్‌లోని హలోల్ (Halol) వద్ద ఉన్న జేఎస్‌డబ్ల్యూ-ఎంజీ మోటార్ (JSW-MG Motor) సౌకర్యాలను ఉపయోగించుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
భారత్‌లో ఈవీల ప్రవేశాన్ని గతంలో కొద్దికాలం పాటు వాయిదా వేసిన ఫోక్స్‌వ్యాగన్.. ఇప్పుడు దేశీయంగా ఈవీల డిమాండ్ పెరుగుతుండటంతో వేగంగా అడుగులు వేస్తోంది. ఈ సరికొత్త వ్యూహం ద్వారా భారత ఆటోమొబైల్ మార్కెట్లో ఫోక్స్‌వ్యాగన్ తన ఉనికిని మరింత బలోపేతం చేసుకోవాలని చూస్తోంది.