EeVela Monday, October 12, 2026
Business /

Sunil Bharti Mittal: సునీల్ భారతి మిట్టల్‌కు ఫ్రాన్స్ అత్యున్నత పౌర పురస్కారం

ఫ్రాన్స్ అత్యున్నత పౌర పురస్కారమైన 'లీజియన్ ఆఫ్ హానర్' (Legion of Honour) నైట్‌గా సునీల్ భారతి మిట్టల్ ఎంపిక.

న్యూఢిల్లీ: భారతీయ టెలికాం దిగ్గజం, భారతీ ఎంటర్‌ప్రైజెస్‌ వ్యవస్థాపక ఛైర్మన్ సునీల్ భారతి మిట్టల్‌ను ఫ్రాన్స్ ప్రభుత్వం అరుదైన గౌరవంతో సత్కరించింది. ఫ్రాన్స్ దేశపు అత్యున్నత పౌర పురస్కారమైన ‘నేషనల్ ఆర్డర్ ఆఫ్ ది లీజియన్ ఆఫ్ హానర్’ (National Order of the Legion of Honour) లో ‘నైట్’ (Chevalier) బిరుదుతో ఆయనను ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ గౌరవించారు. రెండు దేశాల మధ్య ఆర్థిక సంబంధాలను మరింత బలపరచడంలో, టెలికాం, డిజిటల్ రంగాలకు ఆయన అందిస్తున్న విశేష సేవలను గుర్తించి ఈ పురస్కారాన్ని ప్రకటించినట్లు ఫ్రాన్స్ ప్రభుత్వం తెలిపింది.

ఫ్రాన్స్‌తో సునీల్ భారతి మిట్టల్‌కు మూడు దశాబ్దాలకు పైగా సుదీర్ఘ అనుబంధం ఉంది. 1992లో ఎయిర్‌టెల్ ప్రారంభ రోజుల్లో ఫ్రాన్స్‌కు చెందిన ‘కంపెనీ జనరలే డెస్ ఆక్స్’ (Compagnie Générale des Eaux) సంస్థ భారత్‌లో మొబైల్ టెలిఫోనీని ప్రవేశపెట్టేందుకు భారతీతో చేతులు కలిపింది. నేడు యూరప్‌కు చెందిన ప్రముఖ శాటిలైట్ కమ్యూనికేషన్స్ సంస్థ ‘ఈుటెల్‌శాట్’ (Eutelsat) కో-ఛైర్మన్‌గా వ్యవహరిస్తూ ఆయన ఈ సంబంధాలను మరింత ముందుకు తీసుకువెళ్తున్నారు.

ఈ అరుదైన గౌరవంపై సునీల్ భారతి మిట్టల్ స్పందిస్తూ.. ఫ్రాన్స్ ప్రభుత్వం అందించిన ఈ పురస్కారం తనను ఎంతగానో భావోద్వేగానికి గురిచేసిందని, వినమ్రతతో స్వీకరిస్తున్నానని తెలిపారు. భారత్ – ఫ్రాన్స్ దేశాల మధ్య మైత్రిని, ఆర్థిక బంధాన్ని మరింత బలోపేతం చేయడానికి తన వంతు కృషిని కొనసాగిస్తానని పేర్కొన్నారు.

న్యూఢిల్లీలోని ఫ్రెంచ్ రాయబార కార్యాలయంలో ప్రత్యేకంగా నిర్వహించనున్న కార్యక్రమంలో ఈ పురస్కారానికి సంబంధించిన ‘ఇన్సిగ్నియా’ను ఆయనకు లాంఛనంగా ప్రదానం చేయనున్నారు.