17.7 C
Hyderabad
Thursday, February 12, 2026
HomeIndiaYumnam Khemchand Singh: మణిపూర్‌ నూతన ముఖ్యమంత్రిగా ఖేమ్‌చంద్‌ సింగ్‌ ప్రమాణస్వీకారం

Yumnam Khemchand Singh: మణిపూర్‌ నూతన ముఖ్యమంత్రిగా ఖేమ్‌చంద్‌ సింగ్‌ ప్రమాణస్వీకారం

ఇంఫాల్‌, న్యూస్‌టుడే: మణిపూర్‌లో దాదాపు ఏడాది కాలంగా కొనసాగుతున్న రాష్ట్రపతి పాలనకు తెరదించుతూ, నూతన ముఖ్యమంత్రిగా బీజేపీ సీనియర్‌ నేత యమ్నమ్‌ ఖేమ్‌చంద్‌ సింగ్‌ బుధవారం ప్రమాణస్వీకారం చేశారు. ఇంఫాల్‌లోని లోక్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్‌ అజయ్‌ కుమార్‌ భల్లా ఆయనతో పదవీ ప్రమాణం చేయించారు. రాష్ట్రంలో శాంతి స్థాపనే లక్ష్యంగా మైతేయి, కుకీ, నాగా వర్గాలకు ప్రాతినిధ్యం కల్పిస్తూ మంత్రివర్గ కూర్పు జరిగింది.

62 ఏళ్ల ఖేమ్‌చంద్‌ సింగ్‌ గతంలో అసెంబ్లీ స్పీకర్‌గా, మంత్రిగా పనిచేశారు. సింగ్‌జామీ నియోజకవర్గం నుంచి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు.రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా ఇద్దరు ఉపముఖ్యమంత్రులను నియమించారు. బీజేపీకి చెందిన మహిళా ఎమ్మెల్యే నెమ్చా కిప్‌గెన్‌ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. ఆమె దిల్లీలోని మణిపూర్‌ భవన్‌ నుంచి వర్చువల్‌ విధానంలో ప్రమాణం చేయడం విశేషం. ఎన్‌పీఎఫ్‌ (NPF) పార్టీకి చెందిన సీనియర్‌ నేత లోసీ దీఖో మరో డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేశారు. వీరితో పాటు గోవిందాస్‌ కోంతౌజమ్‌ (బీజేపీ), ఖురైజమ్‌ లోకెన్‌ సింగ్‌ (ఎన్‌పీపీ) మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు.

గతేడాది మేలో చెలరేగిన అల్లర్ల నేపథ్యంలో అప్పటి సీఎం బీరేన్‌ సింగ్‌ రాజీనామా చేయడంతో రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించిన విషయం తెలిసిందే. తాజాగా కేంద్రం రాష్ట్రపతి పాలనను ఉపసంహరించుకోవడంతో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా కొత్త ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలిపారు.

ఓ లుక్కేయండి

తాజా వార్తలు

Join WhatsApp Channel