EeVela Monday, October 12, 2026
World /

Russia Rejects Ceasefire: ఉక్రెయిన్ ఎన్నికల కోసం 60 రోజుల కాల్పుల విరమణకు రష్యా నో

మాస్కో: ఉక్రెయిన్‌లో ఎన్నికల నిర్వహణ కోసం ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీ కోరిన 60 రోజుల కాల్పుల విరమణ (Ceasefire) ప్రతిపాదనను రష్యా తోసిపుచ్చింది. ఉక్రెయిన్‌లో ఎన్నికల కోసం 60 రోజుల పాటు సంపూర్ణ కాల్పుల విరమణ ప్రకటించే ప్రసక్తే లేదని క్రెమ్లిన్ అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ స్పష్టం చేశారు. అయితే, ఒకవేళ కీవ్ (ఉక్రెయిన్ రాజధాని) నిజంగానే ఎన్నికలు నిర్వహించాలనుకుంటే, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మాత్రం కేవలం ఎన్నికల రోజున మాత్రం ఉక్రెయిన్‌పై ఎలాంటి దాడులు చేయకూడదని ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉందని ఆయన తెలిపారు.

ఇటీవల అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ, ఉక్రెయిన్‌తో శాంతి ఒప్పందం కుదుర్చుకునేందుకు ఆ దేశంలో “కొత్త అధ్యక్షుడు” రావాల్సిన సమయం ఆసన్నమైందని వ్యాఖ్యానించారు. దీనికి స్పందనగా జెలెన్స్కీ మాట్లాడుతూ.. ఉక్రెయిన్‌లో ఎన్నికలు జరగాలంటే రష్యాతో 60 రోజుల పాటు సంపూర్ణ కాల్పుల విరమణ జరగాలని, అప్పుడే ఎన్నికలను తాము విజయవంతంగా నిర్వహిస్తామని పేర్కొన్నారు.

ఈ క్రమంలోనే జెలెన్స్కీ ప్రతిపాదనపై స్పందించిన రష్యా.. సుదీర్ఘకాలం పాటు కాల్పుల విరమణకు అంగీకరించబోమని తేల్చిచెప్పింది. అయితే, కేవలం ఓటింగ్‌ జరిగే ఆ ఒక్క రోజు మాత్రం దాడుల నుంచి మినహాయింపునిచ్చే యోచనలో రష్యా ఉన్నట్లు తెలుస్తోంది.