EeVela Thursday, October 1, 2026
Health / Telangana /

VRK Diet Case: తప్పుడు సలహాతో ప్రాణాల మీదకు.. వీరమాచనేని రామకృష్ణపై క్రిమినల్ కేసు

హైదరాబాద్ (క్రైమ్ డెస్క్): సోషల్ మీడియా వేదికగా లక్షలాది మందికి డైట్ సలహాలు ఇస్తూ.. రెండు తెలుగు రాష్ట్రాల్లో ‘వీఆర్కే డైట్’ (VRK Diet) సృష్టికర్తగా పాపులర్ అయిన వీరమాచనేని రామకృష్ణ (Veeramachaneni Ramakrishna) పీకల్లోతు కష్టాల్లో పడ్డారు. తన ఆరోగ్య పరిస్థితిని పట్టించుకోకుండా ఇన్సులిన్ ఆపేయమని వీరమాచనేని తప్పుడు వైద్య సలహా ఇచ్చారని, దాని వల్ల తన ప్రాణాలకే ముప్పు వాటిల్లిందని ఆరోపిస్తూ ఓ లా విద్యార్థి చేసిన ఫిర్యాదు మేరకు.. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో ఆయనపై క్రిమినల్ కేసు నమోదైంది. వైద్య రంగానికి సంబంధించి ఎలాంటి అధికారిక డిగ్రీ లేకపోయినా నకిలీ డాక్టర్‌గా చలామణి అవుతున్నారనే తీవ్ర ఆరోపణలతో ఆయనతో పాటు ఆయన సహాయకుడు, డాక్టర్ అని చెప్పుకునే కోటేశ్వరరావును కూడా పోలీసులు ఈ కేసులో నిందితులుగా చేర్చారు.

నిర్మల్ జిల్లాకు చెందిన 30 ఏళ్ల కల్లెడ సాయికృష్ణ లా (LLB) చదువుతున్నాడు. అతడు 2018 నుంచి ‘టైప్-1 డయాబెటిస్’ (Type-1 Diabetes) తో బాధపడుతున్నాడు. ఇలాంటి వారికి శరీరంలో సహజంగా ఇన్సులిన్ ఉత్పత్తి కాదు కాబట్టి, రోజూ బయట నుంచి ఇన్సులిన్ తీసుకోవడం తప్పనిసరి. అయితే, యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో వీరమాచనేని రామకృష్ణ పోస్ట్ చేసిన వీడియోలను సాయికృష్ణ చూశాడు. ఆ వీడియోల్లో వీఆర్కే డైట్ పాటిస్తే టైప్-1 డయాబెటిస్, క్యాన్సర్, కిడ్నీ వ్యాధులు పూర్తిగా, శాశ్వతంగా నయమవుతాయని రామకృష్ణ బల్లగుద్ది మరీ చెప్పడంతో సాయికృష్ణ ఆ మాటలు నిజమేనని గుడ్డిగా నమ్మాడు.

రూ. 26 వేల ఫీజు.. అడ్డగోలు సలహా!

సోషల్ మీడియా ప్రచారాన్ని నమ్మిన సాయికృష్ణ.. 2025 సెప్టెంబర్ నెలలో హైదరాబాద్ షేక్‌పేటలో ఉన్న ‘వీఆర్కే హెల్త్ కేర్ సెంటర్’ను నేరుగా సంప్రదించాడు. అక్కడ వీరమాచనేని రామకృష్ణతో పాటు ఆయన కో-పార్ట్నర్ కోటేశ్వరరావును కలిశాడు. సాయికృష్ణ తనకు టైప్-1 డయాబెటిస్ ఉందని, ఇన్సులిన్ వాడుతున్నానని చెప్పినప్పటికీ.. వారు అతని మెడికల్ హిస్టరీని ఏమాత్రం శాస్త్రీయంగా పరిశీలించలేదు. పైగా, “వెంటనే ఇన్సులిన్ వాడటం ఆపేయాలని, తాము చెప్పే వీఆర్కే డైట్ కచ్చితంగా పాటించాలని” వారు సూచించారు. ఇందుకోసం సప్లిమెంట్లు, డైట్ సర్వీసుల పేరుతో సాయికృష్ణ నుంచి ఏకంగా రూ. 26,000 వసూలు చేశారు. అయితే వారు సాయికృష్ణకు ఇచ్చిన బిల్లుపై ఎలాంటి జీఎస్టీ (GST) నంబర్ గానీ, పన్ను వివరాలు గానీ లేకపోవడం మోసానికి నిదర్శనమని బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నాడు.

రెండు రోజులకే విషమించిన ఆరోగ్యం.. ఐసీయూలో చికిత్స

వీరమాచనేని రామకృష్ణ టీమ్ చెప్పిన విధంగానే సాయికృష్ణ మరుసటి రోజు నుంచే ఇన్సులిన్ ఆపేసి, కఠినమైన వీఆర్కే డైట్ ప్రారంభించాడు. కానీ కేవలం రెండు రోజుల్లోనే అతడి ఆరోగ్యం అత్యంత విషమంగా మారింది. సాయికృష్ణ అపస్మారక స్థితికి చేరుకోవడంతో భయాందోళనలకు గురైన కుటుంబ సభ్యులు వెంటనే అతన్ని సికింద్రాబాద్‌లోని కిమ్స్ (KIMS) ఆసుపత్రికి తరలించారు. అక్కడ అతడిని పరీక్షించిన వైద్యులు.. కచ్చితంగా తీసుకోవాల్సిన ఇన్సులిన్ ఆపేయడం వల్లే ‘డయాబెటిక్ కీటోఎసిడోసిస్’ (Diabetic Ketoacidosis) కు గురయ్యాడని, శరీరంలో నీటి శాతం పూర్తిగా పడిపోయి తీవ్రమైన డీహైడ్రేషన్ బారిన పడ్డాడని నిర్ధారించారు. లక్షలాది రూపాయలు (సుమారు రూ. 58 వేల పైచిలుకు) ఖర్చు చేసి, ప్రాణాపాయం నుంచి బయటపడి సాయికృష్ణ డిశ్చార్జ్ అయ్యాడు.

పోలీసులు నమోదు చేసిన తీవ్రమైన సెక్షన్లు ఇవే..

తాను దారుణంగా మోసపోయానని, వీరమాచనేని తప్పుడు సలహాల వల్లే తన ప్రాణాల మీదికి వచ్చిందని గ్రహించిన సాయికృష్ణ.. న్యాయపోరాటానికి దిగాడు. నష్టపరిహారం కోరుతూ కన్స్యూమర్ కోర్టును సైతం ఆశ్రయించాడు. అలాగే అతడి ఫిర్యాదును స్వీకరించిన రాయదుర్గం పోలీసులు దర్యాప్తు ప్రారంభించి, ఈ క్రింది కఠినమైన సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు:

  • BNS సెక్షన్ 318(4): నమ్మించి మోసం చేయడం (Cheating).
  • BNS సెక్షన్ 125(a): ఇతరుల ప్రాణాలకు లేదా వ్యక్తిగత భద్రతకు ఉద్దేశపూర్వకంగా హాని కలిగించడం.
  • BNS సెక్షన్ 61(2): నేరపూరిత కుట్ర.
  • నేషనల్ మెడికల్ కమిషన్ యాక్ట్ – సెక్షన్ 54: ఎలాంటి గుర్తింపు లేదా మెడికల్ రిజిస్ట్రేషన్ లేకుండా ఆధునిక వైద్యం (అల్లోపతి) ప్రాక్టీస్ చేసి నకిలీ వైద్యుడిగా చలామణి అవ్వడం.
  • డ్రగ్స్ అండ్ మ్యాజిక్ రెమెడీస్ యాక్ట్, 1954 (సెక్షన్లు 3 & 4): డయాబెటిస్ తదితర దీర్ఘకాలిక వ్యాధులను మాయం చేస్తామని తప్పుదోవ పట్టించేలా అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వడం.

వీఆర్కే వీడియోలపై కోర్టు కొరడా!

ఈ వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. వీరమాచనేని రామకృష్ణ సోషల్ మీడియాలో అల్లోపతి వైద్యులపై చేస్తున్న అనుచిత వ్యాఖ్యలు, శాస్త్రీయ ఆధారం లేని వైద్య సలహాలపై ‘హెల్త్‌కేర్ రీఫార్మ్స్ డాక్టర్స్ అసోసియేషన్’ (HRDA) తీవ్రంగా స్పందించింది. సిటీ సివిల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసి.. వీఆర్కే తన సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా అల్లోపతి వైద్యంపై దుష్ప్రచారం చేయకుండా, ఎలాంటి అనధికారిక వైద్య సలహాలు ఇవ్వకుండా ‘స్టే ఆర్డర్’ (Restraining order) తెచ్చింది. కోర్టు ఆదేశాల మేరకు సదరు తప్పుదోవ పట్టించే వీడియోలను ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ తదితర డిజిటల్ ప్లాట్‌‌ఫామ్స్ నుంచి తొలగించాలని లేదా డిసేబుల్ చేయాలని కోరినట్లు హెచ్ఆర్డీఏ ప్రెసిడెంట్ డాక్టర్ కార్తీక్ నాగుల స్పష్టం చేశారు.