ఖమ్మం: తెలంగాణలోని ఖమ్మం జిల్లా ప్రజలకు శ్రీవారి దర్శనం మరింత చేరువ కానుంది. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆధ్వర్యంలో ఖమ్మంలో భారీ వ్యయంతో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించనున్నారు. ఖమ్మం జిల్లా కేంద్రంలోని ధంసలాపురం రెవెన్యూ పరిధిలో, కొత్తగూడెం – అల్లీపురం గ్రామాల మధ్య ఈ దివ్యక్షేత్రం రూపుదిద్దుకోనుంది.
ఖమ్మం–దేవరపల్లి గ్రీన్‌ఫీల్డ్ జాతీయ రహదారికి సమీపంలో ప్రభుత్వం తరఫున 20.04 ఎకరాల భూమిని ఈ ఆలయం కోసం కేటాయించారు. ఈ అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్టు కోసం టీటీడీ ఏకంగా రూ.89 కోట్లను మంజూరు చేసింది. వైఖానస ఆగమ సంప్రదాయం ప్రకారం ఈ ఆలయ నిర్మాణానికి సంబంధించిన శిలాన్యాస పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
భక్తులకు అరుదైన వరం
ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల భక్తులు శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు వెళ్లకుండానే, స్థానికంగానే స్వామివారిని దర్శించుకునేలా ఈ ఆలయాన్ని అత్యాధునిక వసతులతో తీర్చిదిద్దనున్నారు. ప్రతిపాదిత ఆలయ ప్రాంగణంలో భక్తుల సౌకర్యార్థం విశాలమైన గదులు, ఇతర అనుబంధ భవనాలు కూడా నిర్మించనున్నారు.
ఈ మహా ఆలయ నిర్మాణం ద్వారా ఆ ప్రాంతంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకోవడంతో పాటు, పర్యాటకం మరియు స్థానిక ఆర్థిక కార్యకలాపాలకు కూడా గణనీయమైన ఊతం లభించనుంది. తెలంగాణలో ఇప్పటికే హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్, హిమాయత్‌నగర్‌లలో టీటీడీ ఆలయాలు కొనసాగుతుండగా.. ఇప్పుడు ఖమ్మంలో వస్తున్న ఈ కొత్త ఆలయం భక్తుల నుంచి విశేష స్పందనను రాబట్టుకోనుంది.