న్యూఢిల్లీ: ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్ కేంద్రంగా జరిగిన ‘లెహ్రా దో తిరంగ’ నిరసన మార్చ్ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ముఖ్య ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా డిమాండ్ చేస్తూ, ఓటర్ జాబితాల సవరణ (SIR)కు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టాలని తలపెట్టిన సిజెపి (CJP), ఐసా (AISA) నాయకులను ఢిల్లీ పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకోవడం కలకలం రేపింది.
పోలీసుల ముందస్తు నిర్బంధం.. నేహా బోరా విడుదల
ఈ నిరసన మార్చ్లో పాల్గొనేందుకు వెళ్తున్న ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ (AISA) ప్రెసిడెంట్ నేహా బోరాను, కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కేను పోలీసులు అడ్డుకుని ప్రివెంటివ్ డిటెన్షన్ కింద అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీ పోలీస్ యాక్ట్ సెక్షన్ 65 కింద చట్టపరమైన లాంఛనాలు పూర్తి చేసిన తర్వాత నేహా బోరాను శనివారం ఉదయం పోలీసులు విడుదల చేశారు.
కోర్టుకు అభిజీత్ దిప్కే
మరోవైపు CJP ఫౌండర్ అభిజీత్ దిప్కేపై భారతీయ నాగరిక సురక్ష సంహిత (BNSS) సెక్షన్లు 126 మరియు 170 కింద చర్యలు తీసుకున్న పోలీసులు, ఆయనను స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ (SEM) కోర్టు ముందు హాజరుపరచనున్నారు. కన్నాట్ ప్లేస్ పరిసర ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ భద్రతా ఏర్పాట్లు చేయడంతో పాటు సుమారు 150 మందికి పైగా నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.