పశ్చిమ ఆసియా సంక్షోభం తీవ్రస్థాయిలో ఉన్న సమయంలో వాణిజ్య, పారిశ్రామిక ఎల్‌పీజీ గ్యాస్ సరఫరాపై విధించిన ఆంక్షలన్నింటినీ కేంద్ర ప్రభుత్వం గురువారం (జూన్ 25, 2026) ఎత్తివేసింది. గ్యాస్ లభ్యత, సరఫరా పరిస్థితి మెరుగుపడటంతో సంక్షోభానికి ముందు ఉన్న స్థాయిలోనే సరఫరాను పునరుద్ధరిస్తూ నిర్ణయం తీసుకుంది. నాన్-డొమెస్టిక్ (వాణిజ్య) ఎల్‌పీజీ సరఫరాపై వివిధ రంగాల వారీగా విధించిన కోటాలను చమురు మరియు సహజ వాయువు మంత్రిత్వ శాఖ పూర్తిగా ఉపసంహరించుకుంది.
సంక్షోభం మొదలైనప్పుడు బల్క్ ఎల్‌పీజీ (Bulk LPG) వినియోగదారులకు సరఫరాను పూర్తిగా నిలిపివేశారు. తాజా నిర్ణయంతో, వీరికి సంక్షోభానికి ముందు ఉన్న వినియోగంలో 50% వాటాను కేటాయించనున్నారు.
మార్చి ఆరంభంలో వాణిజ్య ఎల్‌పీజీ సరఫరాను తాత్కాలికంగా పరిమితం చేసిన ప్రభుత్వం, ఆ తర్వాత దానిని దశలవారీగా 70 శాతానికి పెంచింది. పీఎన్‌జీ (PNG) కి మారడాన్ని వేగవంతం చేసేందుకు 22 రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలకు 10% అదనపు వాణిజ్య ఎల్‌పీజీని కూడా కేటాయించింది. ఇతర రంగాల్లో కూడా వినియోగించే ప్రొపేన్, బ్యూటేన్‌లను.. కేవలం గృహావసరాల ఎల్‌పీజీ ఉత్పత్తికే ఉపయోగించాలన్న గత నిబంధనను కూడా ప్రభుత్వం సడలించింది.
పీఎన్‌జీ (PNG) విస్తరణపై కొనసాగుతున్న దృష్టి
ఎల్‌పీజీపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు పైప్డ్ నేచురల్ గ్యాస్ (PNG) వాడకాన్ని పెంచాలనే సంకల్పాన్ని మంత్రిత్వ శాఖ పునరుద్ఘాటించింది. ఇప్పటికే పీఎన్‌జీకి మారిన కమర్షియల్, బల్క్ వినియోగదారులు అందులోనే కొనసాగుతారు. పీఎన్‌జీ నెట్‌వర్క్ అందుబాటులో ఉన్న ఇతర ఎల్‌పీజీ వినియోగదారులను, పీఎన్‌జీకి మారే ప్రక్రియలో ఉన్నవారిని సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ (CGD) సంస్థల సమన్వయంతో దశలవారీగా పీఎన్‌జీకి మారుస్తారు.



