వికీపీడియాలో పక్షపాత ధోరణిని తగ్గించి, పారదర్శకతను పెంచడం కోసం ప్రచారం చేపట్టినందుకు గాను, ఆ సంస్థ అసలు సహ-వ్యవస్థాపకులలో ఒకరైన లారీ సాంగర్ (Larry Sanger)ను వికీపీడియా సైట్‌లో ఎలాంటి సవరణలు (Editing) చేయకుండా శాశ్వతంగా బ్లాక్ చేసింది. 2001లో వికీపీడియా ప్రారంభంలో కీలక పాత్ర పోషించి, దాని ప్రాథమిక నిబంధనలను రూపొందించిన సాంగర్‌పై ఈ స్థాయి కఠిన చర్య తీసుకోవడం సంచలనంగా మారింది.
వికీపీడియా నిర్వాహకులు ఒక సుదీర్ఘ చర్చ తర్వాత లారీ సాంగర్‌పై పూర్తి ‘కమ్యూనిటీ నిషేధం’ విధిస్తూ తుది నిర్ణయం తీసుకున్నారు. లారీ సాంగర్ వికీపీడియా వెలుపల ఉండి ప్రచారం చేస్తున్నారని, ప్లాట్‌ఫామ్‌ను ఒక సిద్ధాంతపరమైన యుద్ధభూమిగా మారుస్తున్నారని, మరియు ప్రస్తుత కంటెంట్ వ్యవస్థకు వ్యతిరేకంగా వినియోగదారులను సమీకరిస్తున్నారని ఎడిటర్ల బృందం ఆయనపై ఆరోపణలు చేసింది.
సాంగర్ ఏం చేసారు?
వికీపీడియాలో తటస్థతను, మేధోపరమైన వైవిధ్యాన్ని ప్రోత్సహించడం కోసం సాంగర్ ఇటీవల వికీప్రాజెక్ట్ ఇంటెలెక్చువల్ డైవర్సిటీ (WID) ప్రాజెక్ట్‌ను ప్రారంభించారు. వికీపీడియా ఎడిటోరియల్ ప్రక్రియలో తగిన ప్రాతినిధ్యం లేని హిందువులు, అమెరికన్ కన్జర్వేటివ్‌లు (దక్షిణపక్షవాదులు) వంటి వర్గాలను ఇందులో భాగస్వామ్యం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. వికీపీడియాలో సంస్కరణల కోసం ఆయన 9 ప్రతిపాదనలను ప్రచురించారు. పోటీ కథనాలను అనుమతించడం, శాశ్వత బ్లాకింగ్‌లను ముగించడం, సమాచార వనరులపై ఉన్న బ్లాక్‌లిస్ట్‌ను రద్దు చేయడం, నిర్ణయాలు తీసుకునే వారి వివరాల్లో పారదర్శకత పెంచడం వంటివి ఇందులో ఉన్నాయి.
సాంగర్ ప్రతిపాదించిన ఈ ప్రాజెక్ట్ ద్వారా వికీపీడియాలో నిజమైన తటస్థతను, విస్తృత సమాచార వనరులను (sourcing), మరియు పారదర్శకతను తీసుకురావాలని భావించారు. ఇందులో 90కి పైగా పాలసీ పేజీలను పర్యవేక్షించే ‘పాలసీస్కానర్’ కూడా ఉంది.
జూన్ 20న సాంగర్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, వికీపీడియా తీవ్రమైన లెఫ్ట్ భావజాలంతో, హిందూ వ్యతిరేక ధోరణితో నడుస్తోందని బహిరంగంగా విమర్శించారు. పశ్చిమ దేశాల వామపక్ష జర్నలిస్టులు ముస్లింల దృక్పథాన్ని ఎక్కువగా సమర్థిస్తారని, అదే విధానం వికీపీడియా ఆమోదిత వనరుల ద్వారా ఇక్కడకు చేరుతోందని ఆయన పేర్కొన్నారు. ఈ వివక్షను సరిదిద్దడానికి భారతీయులు, హిందువులు పెద్ద సంఖ్యలో వికీపీడియాలో చేరి ఎడిటర్లుగా మారాలని ఆయన పిలుపునిచ్చారు. వికీపీడియా ఎడిటర్లు ఈ వ్యాఖ్యలనే ఆయనకు వ్యతిరేకంగా ‘క్యాన్వాసింగ్’కు బలమైన సాక్ష్యంగా వాడుకున్నారు.
వికీపీడియా ప్రస్తుతం వాడుతున్న ‘సోర్స్ రేటింగ్ సిస్టమ్’ పక్షపాతంగా ఉందని సాంగర్ విమర్శించారు. వికీపీడియా సిఎన్‌ఎన్ (CNN), న్యూయార్క్ టైమ్స్, బిబిసి వంటి ప్రధాన స్రవంతి మీడియా సంస్థలను “నమ్మదగినవి”గా రేట్ చేయగా.. ఫాక్స్ న్యూస్, న్యూస్‌మ్యాక్స్ వంటి సంస్థలను “నమ్మదగనివి”గా వర్గీకరించింది. లెఫ్ట్ (లిబరల్) వైపు ఉన్న సంస్థలు కూడా రైట్ (కన్జర్వేటివ్) సంస్థల లాగే పక్షపాతంగా వ్యవహరిస్తున్నాయని, కొన్నిసార్లు వికీపీడియా అనుమతించని వనరుల్లోనే అసలు నిజాలు బయటకు వస్తాయని, దీనివల్ల సైట్ యొక్క తటస్థత దెబ్బతింటుందని ఆయన వాదించారు.
వికీపీడియాలో అత్యంత శక్తివంతమైన నిర్ణయాలు తీసుకునే నిర్వాహకులు తమ అసలు పేర్లు కాకుండా మారుపేర్లతో వ్యవహరిస్తారని, కనీస బాధ్యత లేకుండా మిలియన్ల మంది చదివే సమాచారాన్ని నియంత్రిస్తున్నారని సాంగర్ విమర్శించారు. దీనిని ఎడిటర్లు ‘డాక్సింగ్’ కు మద్దతు ఇవ్వడంగా చిత్రీకరించారు.
అయితే, ప్రస్తుత వికీపీడియా ఎడిటర్లు దీనిని ఒక లాబీయింగ్ గ్రూప్‌గా అభివర్ణించారు మరియు దీనివల్ల ఓట్ల మానిప్యులేషన్ జరిగే ప్రమాదం ఉందని ఆరోపిస్తూ 5 రోజుల్లోనే 113 మంది ఎడిటర్ల వ్యతిరేకతతో ఈ ప్రాజెక్ట్‌ను తిరస్కరించారు.
‘ఒపీఇండియా’ వార్తా సంస్థ లక్ష్యంగా
ఈ విచారణ ప్రక్రియలో వికీపీడియా ఎడిటర్లు ‘ఒపీఇండియా’ వార్తా సంస్థను కూడా లక్ష్యంగా చేసుకున్నారు. సాంగర్ గతంలో ఒపీఇండియా, స్వరాజ్య వంటి ప్రచురణలను హిందూ మత సిద్ధాంతాలను అర్థం చేసుకోవడానికి “ముఖ్యమైన మతపరమైన వనరులు”గా పేర్కొనడం, మరియు వికీపీడియా బ్లాక్‌లిస్ట్ చేసిన బ్రైట్‌బార్ట్ న్యూస్, ఒపీఇండియా వంటి వెబ్‌సైట్లను పునరుద్ధరించాలని కోరడాన్ని ఎడిటర్లు తీవ్రంగా తప్పుపట్టారు. ముఖ్యంగా ‘న్యూస్‌లింగర్’ (Newslinger) అనే ఎడిటర్ సాంగర్ ఇంటర్వ్యూని తీవ్రంగా తప్పుపడుతూ ఈ నిషేధాన్ని డిమాండ్ చేశారు. విశేషమేమిటంటే, వికీమీడియా ఫౌండేషన్ నుండి ఈ ఎడిటర్ తన ‘సౌర్సెరర్’ ప్రాజెక్ట్ కోసం నిధులు పొందారని, ఇది వికీపీడియా యొక్క పక్షపాత సోర్స్-రేటింగ్ వ్యవస్థను ఇంటర్నెట్ వ్యాప్తంగా విస్తరించడానికి ఉపయోగపడుతుందని ఒపీఇండియా పేర్కొంది.
గతంలో 2024లో ఒపీఇండియా ప్రచురించిన 187 పేజీల విస్తృత నివేదికను ఈ సందర్భంగా గుర్తుచేశారు. వికీపీడియా అనేది స్వచ్ఛంద సేవకులు నడిపే స్వేచ్ఛా వేదిక కాదని, కేవలం ప్రపంచవ్యాప్తంగా ఉన్న 435 మంది అనామక నిర్వాహకుల గుత్తాధిపత్యంలో నడుస్తున్న ఒక క్రమానుగత వ్యవస్థ అని ఆ నివేదిక ఆధారాలతో నిరూపించింది. ఢిల్లీ అల్లర్లు, గోద్రా రైలు దహనం, “జై శ్రీరామ్” అనే పదం, లేదా ప్రధాని నరేంద్ర మోదీకి సంబంధించిన కథనాలలో హిందూ బాధితుల వివరాలను లేదా లెఫ్ట్ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఉన్న నిజాలను వికీపీడియా ఎలా తొలగించిందో, అలాగే ‘ది వైర్’, ‘స్క్రోల్’ వంటి లెఫ్ట్ మీడియా తప్పులను ఎలా కప్పిపుచ్చిందో ఈ నివేదిక ఎత్తిచూపింది.
నిర్ణయంపై తీవ్రంగా స్పందించిన లారీ సాంగర్
ఈ నిర్ణయంపై లారీ సాంగర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వికీపీడియా కమ్యూనిటీని ఒక “రూపము లేని గుంపు” (mob or a blob) గా ఆయన అభివర్ణించారు. ఇది నిబంధనల ప్రకారం కాకుండా కొందరి ఏకాభిప్రాయంతో నడుస్తోందని ఆరోపించారు. తనకు ఎలాంటి ఆత్మరక్షణ చేసుకునే అవకాశం ఇవ్వకుండా, కనీస చట్టపరమైన ప్రక్రియను అనుసరించకుండా ఈ నిషేధం విధించారని ఆయన మండిపడ్డారు.
జిమ్మీ వేల్స్ వ్యతిరేకత
వికీపీడియా మరో సహ-వ్యవస్థాపకుడైన జిమ్మీ వేల్స్, లారీ సాంగర్‌పై విధిస్తున్న ఈ నిరవధిక నిషేధాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు మరియు దీనిని “హాస్యాస్పదం” అని పేర్కొన్నారు. భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం చేసినంత మాత్రాన ఒకరిని నిషేధించడం తప్పుడు నిర్ణయమని, ఇది వికీపీడియా యొక్క తటస్థత విలువలను దెబ్బతీస్తుందని హెచ్చరించారు. అయినప్పటికీ ఆయన తన వ్యవస్థాపక అధికారాన్ని ఉపయోగించి నేరుగా జోక్యం చేసుకోకపోవడంతో, ఎడిటర్లు ఆయన అభ్యంతరాన్ని పక్కనబెట్టి నిషేధాన్ని అమలు చేశారు.
రంగంలోకి దిగిన అమెరికా కాంగ్రెస్
ఈ వివాదం తీవ్రమవడంతో వికీపీడియాలో పక్షపాత వైఖరి మరియు మానిప్యులేషన్ ఆరోపణలపై అమెరికా హౌస్ ఓవర్సైట్ కమిటీ దర్యాప్తు ప్రారంభించింది. దీనిపై సాంగర్ స్పందిస్తూ.. ప్రభుత్వ జోక్యం పట్ల తనకు అసౌకర్యంగా ఉన్నప్పటికీ, సమస్య తీవ్రత దృష్ట్యా కాంగ్రెస్ పర్యవేక్షణ సమర్థనీయమేనని అన్నారు.



