EeVela Wednesday, September 30, 2026
World /

పాక్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ కంటిచూపునకు ముప్పు?

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ (73) జైలులో ఉండగా తన కుడి కంటి చూపును 85 శాతం మేర కోల్పోయారని ఆయన తరఫు న్యాయవాది సల్మాన్ సఫ్దర్ సంచలన ఆరోపణలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన పాకిస్థాన్ సుప్రీంకోర్టు, ఇమ్రాన్‌ ఆరోగ్య పరిస్థితిని పరిశీలించేందుకు వెంటనే వైద్య బృందాన్ని ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించింది.

కొన్ని నెలల క్రితం వరకు ఇమ్రాన్ కంటి చూపు బాగానే ఉందని, అయితే జైలు అధికారులకు మసకబారుతున్న చూపు గురించి ఫిర్యాదు చేసినా వారు స్పందించలేదని న్యాయవాది తెలిపారు. చికిత్స ఆలస్యం కావడం వల్లే ఇప్పుడు కేవలం 15 శాతం చూపు మాత్రమే మిగిలి ఉందని వెల్లడించారు.

జైలులో నిపుణులైన వైద్యుల పర్యవేక్షణ లేకపోవడం వల్ల కంటిలో రక్తం గడ్డకట్టిందని, ఇదే చూపు మందగించడానికి కారణమని ఇమ్రాన్ తన న్యాయవాదికి వివరించారు.

ఇమ్రాన్ సోదరి అలీమా ఖాన్ మాట్లాడుతూ.. గత మూడు నెలలుగా తన సోదరుడు కంటి సమస్యతో బాధపడుతున్నారని, అధికారులు జనవరి చివరి వరకు ఆసుపత్రికి తరలించలేదని వాపోయారు. ఈ నిర్లక్ష్యమే ఆయన పరిస్థితి దిగజారడానికి కారణమని ఆరోపించారు