న్యూఢిల్లీ (జూన్ 03, 2026): ఆధునిక యుద్ధ రంగంలో డ్రోన్ల (Drones) పాత్ర ఎంత కీలకమో ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న తాజా ఘర్షణలు స్పష్టం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో సరిహద్దుల్లో చైనా, పాకిస్థాన్‌ల నుంచి పొంచి ఉన్న ముప్పును దీటుగా ఎదుర్కొనేందుకు భారత సాయుధ బలగాలు (Indian Armed Forces) సన్నద్ధమవుతున్నాయి. ఇందులో భాగంగా చరిత్రలోనే మునుపెన్నడూ లేని విధంగా అత్యంత భారీ స్థాయిలో మిలిటరీ డ్రోన్లను కొనుగోలు చేసేందుకు కేంద్ర రక్షణ శాఖ సన్నాహాలు చేస్తోంది.
అది కూడా పూర్తిగా ‘మేక్ ఇన్ ఇండియా’ (Make in India) కింద దేశీయ సంస్థల నుంచే సుమారు 2 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 20,000 కోట్లు) విలువైన ఆర్డర్లను ఈ ఏడాది ఇవ్వనున్నట్లు ‘డ్రోన్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా’ (DFI) ప్రెసిడెంట్ స్మిత్ షా తెలిపారు.
ఇటీవలే ప్రభుత్వం టాక్టికల్ డ్రోన్ల కోసం రూ. 3,000 కోట్ల ($313 మిలియన్లు) ఆర్డర్లు ఇచ్చిందని గుర్తుచేశారు. తదుపరి దశలో ఈ ప్రొక్యూర్‌మెంట్ ఏకంగా రూ. 20,000 కోట్లను (200 Billion Rupees) అధిగమించవచ్చని ఆయన అంచనా వేశారు.



