హైదరాబాద్: ప్రముఖ దక్షిణ కొరియా ఆటోమొబైల్ దిగ్గజం ‘హ్యుందాయ్ మోటార్స్’ (Hyundai Motors) తన సరికొత్త కార్ల తయారీ ప్లాంట్ను (Car Manufacturing Facility) హైదరాబాద్లో లేదా తెలంగాణ పరిధిలో ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్ ఇచ్చారు.
హైదరాబాద్లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల వికాస కేంద్రంలో (MCRHRD) హ్యుందాయ్ మోటార్ ఇండియా ఇంజినీరింగ్ (HMIE) మేనేజింగ్ డైరెక్టర్ చాంగ్యాన్ చో నేతృత్వంలోని ప్రతినిధి బృందం ముఖ్యమంత్రితో భేటీ అయింది. ఈ సందర్భంగా తెలంగాణలో ఉన్న పారిశ్రామిక అనుకూలతలను సీఎం వారికి వివరించారు.
రూ.8,528 కోట్ల ఆర్ అండ్ డీ ప్రాజెక్టుకు లైన్ క్లియర్
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లోని నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ (NIMZ) పరిధిలో 678 ఎకరాల్లో హ్యుందాయ్ సంస్థ రూ.8,528 కోట్ల భారీ పెట్టుబడితో ‘ఇంటిగ్రేటెడ్ గ్లోబల్ ఆర్ అండ్ డీ’ (R&D) సెంటర్ మరియు టెస్ట్ ట్రాక్ను ఏర్పాటు చేయనుంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా సుమారు 4,276 మందికి ప్రత్యక్ష ఉద్యోగావకాశాలు లభించనున్నాయి.
ఈ ఆర్ అండ్ డీ సెంటర్కు సంబంధించి పెండింగ్లో ఉన్న అన్ని రకాల ప్రభుత్వ అనుమతులను తక్షణమే పూర్తి చేసి, వేగంగా భూమిపూజకు ఏర్పాట్లు చేయాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.
ప్రతిపక్షాల విమర్శలు పక్కనపెట్టి..
హ్యుందాయ్ ప్రాజెక్టుల విషయమై బిఆర్ఎస్ (BRS) తదితర ప్రతిపక్షాల నుంచి రాజకీయ విమర్శలు వచ్చినప్పటికీ, వాటిని ఏమాత్రం పట్టించుకోకుండా రాష్ట్ర పారిశ్రామిక ప్రయోజనాలకే సీఎం ప్రాధాన్యతనిచ్చారు.
భారత్లోనే అత్యంత నివాసయోగ్యమైన, సురక్షితమైన కాస్మోపాలిటన్ నగరంగా హైదరాబాద్ నిలిచిందని, రహదారి, రైలు, విమాన రవాణాతో పాటు పోర్టులతో కనెక్టివిటీకి అవసరమైన మౌలిక వసతులు ఉన్నాయని తెలిపారు. భవిష్యత్తులో నిర్మించబోయే ‘భారత్ ఫ్యూచర్ సిటీ’ మరియు ‘ప్యూరి’ (PURE) ప్రాజెక్టులలో భాగస్వాములు కావాలని కోరిన సీఎం, డిసెంబర్లో జరగనున్న ‘ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్’కు హ్యుందాయ్ ప్రతినిధులను ప్రత్యేకంగా ఆహ్వానించారు.