వైసీపీలో జగన్ తర్వాత నంబర్ టూ గా చెలామణి అయిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అసంతృప్తిగా ఉన్నారా? అవును అని కొందరు అంటున్నా .. ఆయన మద్దతుదారులు మాత్రం అదేం లేదు అంటున్నారు.
నిన్న ఉమ్మడి కడప జిల్లా బద్వేల్‌లో వైఎస్ జగన్ పర్యటించారు. అయితే ఆ పర్యటనకు పెద్దిరెడ్డి హాజరు కాలేదు. అదే సమయంలో ఆయన కుటుంబంతో పాటు షిర్డీలో ఉన్నారు. నిజానికి ఇటీవలే పెద్దిరెడ్డికి ఉమ్మడి కడప, కర్నూలు జిల్లాల సమన్వయకర్తగా బాద్యతలు అప్పచెప్పారు. అలాగే ఆయన కుమారుడు మిధున్ రెడ్డికి అనంతపురం, నెల్లూరు జిల్లాల సమన్వయకర్తగా బాధ్యతలు ఇచ్చారు. తమకు ఇచ్చిన ఆయా బాధ్యతల పట్ల వారిద్దరూ తీవ్ర నిరాశలో ఉన్నారని .. తనను ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడిగా తప్పించడంలో చెవిరెడ్డి జగన్ వద్ద చక్రం తిప్పారని.. చెవిరెడ్డికి జగన్ ప్రాధాన్యత ఇస్తుండడం పేదిరెడ్డి కుటుంబానికి నచ్చడం లేదు అని..అందుకే ఆ పర్యటనకు పెద్దిరెడ్డి దూరంగా ఉన్నారని కొందరు అంటున్నారు.
అందుకే బద్వేల్‌లో బుధవారం జగన్ పర్యటిస్తారని తెలిసి కూడా పెద్దిరెడ్డి కుటుంబం ఆ ముందు రోజు రాత్రే షిరిడీకి పయనమై వెళ్లిపోయారని భావిస్తున్నారు.
ఆయన తనకు ఇచ్చిన జిల్లాల విషయంలో అసంతృప్తిగా ఉన్నారని వారంటున్నారు. జగన్ స్వంత జిల్లా అయిన ఉమ్మడి కడప జిల్లాలో జగన్‌ను కాదని, తాను ఏ నిర్ణయాన్ని తీసుకునే పరిస్థితి లేదని.. ఎవరూ తనను లెక్కచేయరని అలాగే కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి హవా కూడా అక్కడ ఉంటుందని తన పాత్ర నామమాత్రమే అని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భావిస్తున్నారట! అలాగే ఉమ్మడి కర్నూలు జిల్లాలో అందరూ సీనియర్ నాయకులేనని వాళ్లంతా జగన్‌కు దగ్గరగా వుంటారని, అక్కడ కూడా తన మాట చెల్లదని పెద్దిరెడ్డి భావనట!
అందుకే తన అసంతృప్తిని వెళ్ళకక్కేటందుకే ఆయన జగన్ బద్వేలు పర్యటనకు డుమ్మా కొట్టారని.. ఈ విషయంపై జగన్ సానుకూలంగా ఆలోచిస్తే సరే .. లేదంటే పెద్దిరెడ్డి భవిష్యత్ లో మరో ఆలోచన చేసే అవకాశం కూడా లేక పోలేదని ఆయా వర్గాల వారు చెపుతున్నారు..
జగన్ కి పెద్దిరెడ్డికి గ్యాప్ పెంచే కుట్ర
అయితే ఇదంతా కేవలం జగన్ మరియు పెద్దిరెడ్డి మధ్య అగాధం సృష్టించేందుకు కొందరు చేస్తున్న ప్రయత్నాల ప్రభావమే అని.. . జగన్ ఎప్పటికీ పెద్దిరెడ్డి కుటుంబాన్ని వదులుకోరు అని ఆయనకు, మిధున రెడ్డికి పెద్ద పేట వేసేందుకే ఆయా జిల్లాల బాద్యతలు అప్పచెప్పారని .. ఈ విషయంలో డైరెక్ట్ గా జగన్ తో మాట్లాడగలిగే సత్తా ఉన్న ఏకైక నాయకుడు పెద్దిరెడ్డి అని కొందరు పెద్దిరెడ్డి అనుచరులు అంటున్నారు.
చూడాలి మరి రాబోయే కొద్ది రోజుల్లో పెద్దిరెడ్డి రాజకీయం ఎలా మలుపు తిరుగుతుందో?!