పశ్చిమ బెంగాల్ లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం రాజకీయ ఉద్రిక్తతలు భగ్గుమంటున్నాయి. తాజాగా, బీజేపీ సీనియర్ నాయకుడు సువేందు అధికారి వ్యక్తిగత సహాయకుడు (PA) చంద్రనాథ్ రథ్‌ను బుధవారం రాత్రి గుర్తుతెలియని దుండగులు దారుణంగా కాల్చి చంపారు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది.
బుధవారం రాత్రి ఉత్తర 24 పరగణాల జిల్లా పరిధిలోని మధ్యామ్‌గ్రామ్ ప్రాంతంలో చంద్రనాథ్ రథ్‌పై గుర్తుతెలియని దుండగులు ఆకస్మికంగా తుపాకులతో దాడి చేశారు. ఈ కాల్పుల్లో తీవ్రంగా గాయపడి రక్తపు మడుగులో పడివున్న ఆయనను హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించారు. అయితే, ఆయన అప్పటికే మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, ఆధారాలు సేకరించి దర్యాప్తు ప్రారంభించారు.



