EeVela Thursday, October 15, 2026
Nation / Politics / trending /

దేశం విడిచి వెళ్లాలంటూ బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ ఖాన్‌కు నోటీసులు – బాంబే హైకోర్టులో సవాల్!

ముంబై: బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ ఖాన్‌కు (Imran Khan) ఊహించని పరిణామం ఎదురయ్యింది. ముంబైలో జరిగిన ఓ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నందుకు గాను, భారత దేశాన్ని విడిచిపెట్టి వెళ్లిపోవాలంటూ ఫారినర్స్ రీజినల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ (FRRO) ఆయనకు ఉత్తర్వులు జారీ చేసింది. అక్టోబర్ 28వ తేదీలోగా దేశం విడిచి వెళ్లాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఆయన బాంబే హైకోర్టును ఆశ్రయించనున్నారు.

అసలు వివాదం ఏమిటి?

కొద్ది రోజుల క్రితం ముంబైలో ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) ఆధ్వర్యంలో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీనామా కోరుతూ నిర్వహించిన నిరసన ప్రదర్శనలో నటుడు ఇమ్రాన్ ఖాన్ పాల్గొన్నారు. ఈ ఆందోళనకు హాజరైన ఆయనపై బీజేపీ నేత కిరీట్ సోమయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఇమ్రాన్ ఖాన్ అమెరికన్ పౌరుడని, ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా (OCI) కార్డు కలిగి ఉన్నప్పటికీ నిబంధనల ప్రకారం ఆయన ఎలాంటి రాజకీయ నిరసనల్లో లేదా ఆందోళనల్లో పాల్గొనకూడదని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదును పరిశీలించిన పోలీసులు, దీన్ని ఎఫ్‌ఆర్‌ఆర్‌ఓకు పంపడంతో వారు ఇమ్మాన్యుయేట్ డిపార్ట్మెంట్ ఆర్డర్ కింద ‘లీవ్ ఇండియా’ నోటీసులు జారీ చేశారు. ఇమ్మిగ్రేషన్ అండ్ ఫారినర్స్ యాక్ట్, 2025 కింద ఈ చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.

హైకోర్టులో పోరాటానికి సిద్ధం

ఈ డిపోర్టేషన్ (దేశం నుంచి బహిష్కరణ) ఉత్తర్వులపై ఇమ్రాన్ ఖాన్ న్యాయవాది జుల్ఫికర్ మెమన్ బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నారు. మరోవైపు, ఇమ్రాన్ ఖాన్ తాతల కాలం నుంచి ఈ దేశంతో అనుబంధం ఉన్న వ్యక్తి అని, ఆయన ఈ దేశాన్ని ఎంతో ప్రేమిస్తారని రాజకీయ నాయకులు కొందరు ఈ చర్యను తప్పుబడుతున్నారు. ఈ వ్యవహారం ప్రస్తుతం బాలీవుడ్‌తో పాటు రాజకీయ వర్గాల్లోనూ తీవ్ర చర్చనీయాంశమైంది.