నార్వేలో మీడియాకి ముఖం చాటేసిన మోదీ: ప్రెస్ ఫ్రీడమ్ ప్రశ్నలపై మౌనం..

నార్వే: భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నార్వే పర్యటనలో ఎదురైన కొన్ని పరిణామాలు ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశమయ్యాయి. ముఖ్యంగా భారత దేశంలో పత్రికా స్వేచ్ఛ ...

నార్వే: భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నార్వే పర్యటనలో ఎదురైన కొన్ని పరిణామాలు ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశమయ్యాయి. ముఖ్యంగా భారత దేశంలో పత్రికా స్వేచ్ఛ (Press Freedom) మరియు మానవ హక్కుల అంశంపై నార్వేకి చెందిన ఒక జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నలు, దానికి భారత ప్రభుత్వం స్పందించిన తీరుపై ఇప్పుడు విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

నార్వే పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ అక్కడి ప్రధాని జోనాస్ గహర్ స్టోర్‌తో కలిసి విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. అయితే, ఈ సమావేశంలో మోదీ విలేకరుల ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేదు. ఈ క్రమంలో నార్వేకి చెందిన ‘దగ్సావిసెన్’ (Dagsavisen) పత్రికా విలేకరి హెల్లే లింగ్ స్వెన్డ్సెన్, మోదీని నేరుగా ఒక ప్రశ్న అడిగారు.

“ప్రధాని మోదీ గారూ.. ప్రపంచంలోనే అత్యంత స్వేచ్ఛా పత్రికలున్న నార్వేలో మీరు మీడియా ప్రశ్నలకు ఎందుకు సమాధానం ఇవ్వడం లేదు?” అని ఆమె ప్రశ్నించారు. అయితే ప్రధాని మోదీ ఆమె ప్రశ్నకు సమాధానం ఇవ్వకుండానే అక్కడి నుండి వెళ్లిపోయారు. దీనిపై సదరు జర్నలిస్ట్ సోషల్ మీడియా వేదికగా అసహనం వ్యక్తం చేశారు. విదేశీ నేతలు నార్వే వచ్చినప్పుడు మీడియా ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం ఇక్కడ ఆనవాయితీ అని, కానీ మోదీ విషయంలో అది జరగలేదని ఆమె పేర్కొన్నారు.

అదే రోజు జరిగిన మరో సమావేశంలో, ఆ జర్నలిస్ట్ భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి (వెస్ట్) సిబి జార్జ్ ను భారత్‌లో మానవ హక్కుల ఉల్లంఘనలపై ప్రశ్నించారు. “భారత్‌లో మానవ హక్కుల ఉల్లంఘనలు జరుగుతుంటే, నార్వే మీపై ఎందుకు నమ్మకం ఉంచాలి?” అని ఆమె నిలదీశారు.

దీనికి సిబి జార్జ్ స్పందిస్తూ.. భారత్ ఒక పురాతన నాగరికత అని, చదరంగం (Chess), సున్నా (Zero), యోగా వంటివి భారత్‌లోనే పుట్టాయని సమాధానం ఇచ్చారు. కొవిడ్ సమయంలో భారత్ ప్రపంచ దేశాలకు టీకాలు ఇచ్చిందని గుర్తుచేశారు. అయితే, ఆమె అడిగిన మానవ హక్కుల ప్రశ్నకు నేరుగా సమాధానం చెప్పకుండా పాత విషయాలు చెప్పడంపై నెటిజన్లు “వాట్ ఎబౌటరీ” (Whataboutery) అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.

ఇదిలాఉండగా, 2026 ప్రపంచ పత్రికా స్వేచ్ఛా సూచీలో భారత్ 180 దేశాలలో 157వ స్థానానికి పడిపోయింది. గత ఏడాది (151వ స్థానం) తో పోలిస్తే ఇది మరింత దిగజారిందని నివేదికలు చెబుతున్నాయి. భారత్‌లో జర్నలిస్టులపై ఒత్తిడి, ఆన్‌లైన్ వేధింపులు మరియు చట్టపరమైన చర్యలు పెరుగుతున్నాయని అంతర్జాతీయ మీడియా సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

Join WhatsApp Channel