బుధవారం (జూన్ 24, 2026) సాయంత్రం వెనిజులా దేశాన్ని కుదిపేసిన రెండు శక్తివంతమైన భూకంపాలు వణికించాయి. ఈ భూకంపాల ధాటికి దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 235 మంది ప్రాణాలు కోల్పోయారు. సుమారు 1,500 మందికి పైగా గాయపడగా, వేలాది మంది గల్లంతయ్యారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
కేవలం ఒక నిమిషం (39 సెకన్లు) వ్యవధిలోనే రెండు శక్తివంతమైన భూకంపాలు సంభవించాయి. మొదటిది 7.2 తీవ్రతతో రాగా, వెంటనే 7.5 తీవ్రతతో రెండోది కుదిపేసింది. శతాబ్ద కాలంలో వెనిజులాలో ఇంతటి తీవ్రతతో భూకంపాలు రావడం ఇదే తొలిసారి.
రాజధాని కారకాస్ (Caracas) కు ఉత్తరాన ఉన్న ‘లా గ్వైరా’ (La Guaira) తీర ప్రాంతంలో అత్యధిక ఆస్తి, ప్రాణనష్టం సంభవించింది. ఇక్కడి పరిస్థితి దారుణంగా ఉండటంతో ఈ ప్రాంతాన్ని ప్రభుత్వం విపత్తు ప్రాంతం గా ప్రకటించింది. భవనాలు కుప్పకూలడంతో ప్రాణాలతో బయటపడిన వారిని రక్షించేందుకు సహాయక బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. అయితే, కారకాస్‌లోని ప్రధాన విమానాశ్రయం ధ్వంసం కావడంతో విదేశాల నుంచి సహాయక సామగ్రి రావడానికి తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది.
విపత్తు నేపథ్యంలో సహాయక చర్యలు, నిధుల లావాదేవీలకు ఆటంకం కలగకుండా ఉండేందుకు అమెరికా ట్రెజరీ.. వెనిజులాపై ఉన్న కొన్ని ఆర్థిక ఆంక్షలను అక్టోబర్ 23 వరకు సడలించింది. భవనాలు కుప్పకూలడం, మళ్లీ ప్రకంపనలు వస్తాయన్న భయంతో వేలాది మంది కారకాస్ వీధుల్లో, పార్కుల్లో చలికి వణికిపోతూ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని కాలం వెళ్లదీస్తున్నారు. విద్యుత్, ఇంటర్నెట్, గ్యాస్ సేవలు పూర్తిగా నిలిచిపోయాయి.
మెక్సికో, ఖతార్, బ్రెజిల్, స్పెయిన్ తదితర దేశాలు వెనిజులాకు సహాయం పంపేందుకు ముందుకు వచ్చాయి. ఐక్యరాజ్యసమితి, అమెరికా కూడా ప్రత్యేక రెస్క్యూ బృందాలను అక్కడికి పంపుతున్నాయి.



