ఇంకో వందరోజుల్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలకు జరగనున్న తరుణంలో ప్రస్తుతం అధికారంలో ఉన్న డెమోక్రటిక్ పార్టీ తరఫున ఎవరు పోటీ చేస్తారు అనే దానిపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. ఒకవైపు రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది నవంబర్ లో జరగనున్న ఎన్నికలలో డెమోక్రటిక్ పార్టీ తరపున మరోసారి పోటీ చేయాలని అనుకున్న ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ స్వంత పార్టీలో వ్యతిరేకత వల్ల వైదొలిగారు.
ప్రస్తుత అమెరికా ఉపాధ్యక్షురాలు, భారత సంతతికి చెందిన కమలా హ్యారిస్‌కు డెమోక్రటిక్ పార్టీలో అత్యధికులు, ఆ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు మద్దతు ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవలి కొన్ని సర్వేల్లో ట్రంప్ కు కమల అయితేనే గట్టి పోటీ ఇవ్వగలరు అని వచ్చింది. పార్టీలో కూడా ఆమెకు 2500మందికి పైగా మద్దతిచ్చినట్లు సమాచారం. డెమోక్రటిక్ అభ్యర్థిగా బరిలో నిలవాలంటే మొత్తం 4,800 మందిలో 1,976 మంది డెలిగేట్ల మద్దతు అవసరమవుతుంది. ఈ లెక్కన ఆమె అధ్యక్ష అభ్యర్థిగా ఎన్నిక అవడం దాదాపు ఖాయం.
అయితే గతంలో అమెరికాకు రెండు పర్యాయాలు అధ్యక్షుడిగా పనిచేసిన డెమోక్రటిక్ పార్టీ నేత బరాక్ ఒబామా మనసులో ఏముందో ఎవరికీ అర్ధం కావడం లేదు. నిజానికి జో బైడెన్ పోటీ నుంచి తప్పుకోడానికి ఒబామా కూడా ఒ కారణం. ఆయనతో పాటు పలువురు సొంత పార్టీ నేతలు కూడా బైడెన్ పోటీపై వ్యతిరేకత వ్యక్తం చేయడంతో ఆయన అభ్యర్థిత్వ రేసు నుంచి వైదొలిగారు.
ఇలాంటి పరిస్థితిలో ఆయన అభిప్రాయం కీలకం గా మారింది. ట్రంప్‌పై ఆమె గెలిచే అవకాశాలు లేవని ఒబామా భావిస్తున్నట్లు అమెరికా మీడియాలో కథనాలు వస్తున్నాయి. చాలా అంశాలపై ఆమె తన అభిప్రాయాలను కూడా స్పష్టంగా చెప్పలేక పోతున్నారు అని ఆయన భావిస్తున్నారట.
ఇప్పటివరకు దేశ సరిహద్దులకు కూడా వెళ్లని కమలా హ్యారిస్ వలసదారులందరికీ ఆరోగ్య బీమా ఉండాలని మాట్లాడటం ఒబామాకు నచ్చలేదు అని .. దేశం ఎదుర్కొంటున్న సవాళ్లను, సమస్యలను అధిగమించేలా ఆమె అభిప్రాయాలు లేవు అని భావిస్తుండం వల్లనే ఒబామా కమల వైపు మొగ్గు చూపడం లేదని అంటున్నారు.
అయితే కమలా హ్యారిస్ అధ్యక్ష ఎన్నికల బరిలో నిలబడడానికి పార్టీలో కావలసినంత మంది మద్దతును ఇప్పటికే కూడగట్టారు. అయినా ఆయన ఆగస్టులో జరిగే డెమోక్రటిక్ జాతీయ సదస్సులో ఒబామా చెప్పే అభిప్రాయం కూడా కీలకం కాగలదు.