ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన గురువారం జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం (AP Cabinet) పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. ఇటీవల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటనలో ఇంధన పొదుపు ఆవశ్యకతను నొక్కిచెప్పిన నేపథ్యంలో.. ఏపీ ప్రభుత్వం అప్రమత్తమై సంచలన నిర్ణయాలు తీసుకుంది. దేశవ్యాప్తంగా వనరుల పొదుపుపై చర్చ జరుగుతున్న తరుణంలో, ఏపీ క్యాబినెట్ ఏకంగా ‘నో వెహికల్ డే’ (No Vehicle Day) అమలుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఇంధన వినియోగాన్ని తగ్గించడం ద్వారా పర్యావరణాన్ని రక్షించడంతో పాటు ఆర్థిక భారాన్ని తగ్గించుకునే దిశగా వారానికి ఒకరోజు ‘నో వెహికల్ డే’ పాటించాలని క్యాబినెట్ తీర్మానించింది. మంత్రులు, అధికారులు అందరూ సొంత లేదా ప్రభుత్వ వాహనాలకు బదులుగా ప్రజా రవాణా (Public Transport), ఎలక్ట్రిక్ వాహనాలు (EVs) లేదా సైకిళ్లను వినియోగించాలని ప్రభుత్వం సూచించింది. మంత్రులు స్థాయి నుంచి అధికారుల వరకు వాహనాల సంఖ్యను కూడా భారీగా తగ్గించాలని నిర్ణయించారు.
ప్రజల్లో పొదుపు మంత్రాన్ని పెంపొందించేందుకు ‘నా దేశం – నా బాధ్యత’ అనే పేరుతో రాష్ట్రవ్యాప్తంగా భారీ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కేవలం ప్రభుత్వం మాత్రమే కాకుండా, ప్రజలు కూడా తమ దైనందిన జీవితంలో ఇంధన, విద్యుత్ పొదుపు పాటించేలా ఈ కార్యక్రమం ద్వారా అవగాహన కల్పించనున్నారు.



