హిందువులు అత్యంత ఇష్టంగా పవిత్రంగా జరుపుకునే పండుగలలో శ్రీ కృష్ణాష్టమి ఒకటి. శ్రీకృష్ణుడు పుట్టినరోజునే శ్రీకృష్ణ జన్మాష్టమిగా జరుపుకుంటాము. ఈ పర్వదినాన్నే శ్రీకృష్ణ జన్మాష్టమి, గోకులాష్టమి, అష్ఠమి రోహిణి, కృష్ణాష్టమిగా వివిధ ప్రాతాల్లో వివిధ పేర్లతో పిలుస్తారు. దేశ వ్యాప్తంగా వైభవంగా జరుపుకునే పండుగలలో కృష్ణాష్టమి ఒకటి. ప్రతీ ఏటా శ్రావణ మాసం కృష్ణపక్షంలోని అష్టమి తిథి, రోహిణి నక్షత్రంలో కృష్ణాష్టమి నిర్వహిస్తారు.
శ్రీ కృష్ణ జన్మాష్టమి ఎప్పుడు జరుపుకోవాలి..?
అయితే ఈ ఏడాది కృష్ణాష్టమి పండుగ ఆగస్టు 26, 27 తేదీల్లో అష్టమి తిథి రావడంతో రెండు రోజుల్లో ఏరోజు జరుపుకోవాలి అనే సందేహం చాలమందిలో ఉంది. దీనికి సంబంధించి పంచాగ కర్తలు..పండితులు స్పష్టత ఇస్తున్నారు. భక్తుల్లో ఉన్న గందరగోళానికి తెర దించుతున్నారు. ఈ నెల 26, 27 తేదీల్లో నక్ష్రతం..ప్రత్యేకత..సంప్రదాయం గురించి వివరిస్తున్నారు. జన్మాష్టమి సెలవు 26వ తేదీన ప్రకటించారు. మరి.. శ్రీ కృష్ణ జన్మాష్టమి ఎప్పుడు జరుపుకోవాలి..అనేది ఇప్పుడు చూద్దాం!
పురాణ గ్రంధాల ప్రకారం శ్రీ మహా విష్ణువు అవతారమైన శ్రీ కృష్ణుడు అష్టమి తిథి రోజున అర్ధరాత్రి రోహిణి నక్షత్రంలో జన్మించాడు. ఈసారి అష్టమి తిధి రెండు రోజులను కలుపుతూ రావటమే ఈ అనుమానాలకు కారణం. . వైదిక క్యాలెండర్ ప్రకారం శ్రావణ మాసంలోని కృష్ణ పక్ష అష్టమి ఆగస్ట్ 26న సాయంత్రం 06.09 గంటలకు ప్రారంభమై మర్నాడు అంటే 27 ఆగస్టు 2024 సాయంత్రం 04.49 గంటలకు అష్టమి తిథి ముగుస్తుంది. కాబట్టి స్మార్త సంప్రదాయం (విష్ణువుని, శివుడిని ఇద్దరినీ ఆరాధించే) వారు ఆగస్టు 26న జన్మాష్టమి జరుపుకోవాలని చెబుతున్నారు. 26 న ఉపవాసం పాటిస్తే వంద జన్మల పాపాల నుంచి విముక్తి లభిస్తుంది. మానవ జన్మ ఎత్తిన శ్రీకృష్ణుని పట్ల భక్తితో జీవిస్తారట. కృష్ణాష్టమి రోజున రోహిణి నక్షత్రం కూడా ఉంటుంది కాబట్టి ఉపవాసం చేసి శ్రీకృష్ణుడిని మరు జన్మ అనేది లేకుండా మోక్షం లభిస్తుంది.
అలాగే వైష్ణవులు ఆగస్టు 27న నిర్వహించాలని సూచిస్తున్నారు. ఈ సమయంలోనే పండితులు కీలక సూచన చేస్తున్నారు. అరుణ జన్మాష్టమి వేడుకలు, ఆగస్టు 27న ఉట్టికొట్టే ఉత్సవం నిర్వహించాలని సూచిస్తున్నారు. వైష్ణవ సంప్రదాయ ప్రకారం సూర్యోదయానికి ఉన్న తిధిని బట్టి ఆయా కార్యక్రమాలు నిర్వహించుకుంటారు. దీని ప్రకారం 27 ని శ్రీకృష్ణ జన్మాష్టమిని నిర్వహించటం సమచితమనే అభిప్రాయం వినిపిస్తుంది.
శ్రీకృష్ణాష్టమి రోజున ఏమి చేయాలి
తన లీలలతో భక్తి, జ్ఞానం, యోగం, మోక్షం గురించి ప్రపంచానికి తెలియజేస్తున్న శ్రీకృష్ణ పరమాత్మ పుట్టిన శుభదినం అయిన శ్రీకృష్ణాష్టమి రోజున ఎవరైతే కృష్ణుని పూజిస్తారో వారికి సకల సౌభాగ్యాలు లభిస్తాయని ప్రగాఢంగా విశ్వసిస్తారు. అందుకే శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదినంగా హిందువులంతా అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటూ ఉంటారు. సంతానలేమితో బాధపడే వారు ఈ రోజు కృష్ణుని పూజిస్తే చిన్నారి కృష్ణుడు తమ జీవితంలోని అడుగు పెడతాడని గట్టిగా నమ్ముతారు. అమ్మలందరు యశోదలుగా, బాలికలంతా గోపెమ్మలుగా, బాలురు చిన్నారి కృష్ణయ్య లుగా ఈరోజు కనువిందు చేస్తారు. కృష్ణాష్టమి పర్వదినాన కృష్ణ దేవాలయాలలో పూజలు, గీతా పఠనాలు, ఉట్టి కొట్టడం లాంటి కార్యక్రమాలు ఘనంగా నిర్వహిస్తారు.