Sravana Purnima 2024 (ఆగస్టు 19) రాఖీ పౌర్ణమి.. ఎప్పుడు.. ఎలా జరుపుకోవాలి.. ముహూర్తం ఇదే

శ్రావణ పూర్ణిమను రాఖీ పూర్ణిమ, జంధ్యాల పూర్ణిమ అనే పేర్లతో కూడా పిలుస్తారు. అన్నాచెల్లెళ్లు లేదా అక్కాతమ్ముళ్ల మధ్యన ప్రేమానురాగాలకు సూచకంగా ఈ పండుగను జరుపుకుంటారు. అన్నకుగాని తమ్మునికిగాని ప్రేమ సూచకంగా సోదరి కట్టే రాఖీ అని పిలిచే ఒక పట్టీని కట్టడం ఈ పండుగ ప్రాధాన్య విశేషం. రాఖీ అనగా రక్షణ బంధం. సాధారణంగా జంధ్యాన్ని ధరించేవారు ఈ రోజునే పాతది వదిలి కొత్త దానిని ధరిస్తారు. అందుకే ఈరోజుని జంద్యాల పౌర్ణమి అని కూడా అంటారు. ఉపనయనం అయిన వారు జంధ్యాల పౌర్ణమి రోజు గాయత్రీ పూజచేసి కొత్త యఙ్ఞోపవీతాన్ని ధరించి పాతది తీసివేస్తారు.

పురాణాల ప్రకారం రాఖీ పండుగ కృతయుగం నుంచి ఆచరిస్తున్నారు. ప్రస్తుతం రాఖీ పౌర్ణమిని ఒక్కో రాష్ట్రంలో ఒక్కో పేరుతో జరుపుకుంటారు. ఉత్తర భారతంలో రక్షా బంధన్​గా పిలిచే ఈ పండుగను సావనీ, సలోనా అని కూడా అంటారు. గుజరాత్​లో పవిత్రోపనా, మహారాష్ట్రలో నరాళి పూర్ణిమ, దక్షిణ భారతంలో నారికేళ పౌర్ణమి అని పిలుస్తారు. బంగాల్, ఒడిశా రాష్ట్రాల్లో ఘూలాన్ పూర్ణిమగా జరుపుకుంటారు.

రాఖీ పూర్ణిమ చరిత్ర

పూర్వం దేవతలకు రాక్షసులకు మధ్య సుదీర్ఘంగా పుష్కర కాలం పాటు యుద్ధం సాగింది. యుద్ధంలో ఓడిపోయిన దేవతల రాజు దేవేంద్రుడు, తన పరివారం అంతటినీ కూడగట్టుకుని అమరావతిలో తలదాచుకున్నాడని …  భర్త నిస్సహాయతను చూసిన ఇంద్రాణి తరుణోపాయం ఆలోచించి రాక్షసరాజు అమరావతిని దిగ్బంధనం చేస్తున్నాడని తెలుసుకుని భర్త దేవేంద్రుడికి యుద్ధం చేయాలనే ఉత్సాహాన్ని కల్పించి ముందుకు పంపుతుంది. 

అయితే సరిగ్గా ఆ రోజే శ్రావణ పౌర్ణమి కావడంతో పార్వతీ పరమేశ్వరులను…  లక్ష్మీనారాయణులను అత్యంత భక్తితో పూజించి రక్షను దేవేంద్రుడు చేతికి కడుతుంది. ఇక దేవతలందరూ కూడా ఆ రక్షలను ఇంద్రుడి చేతికి కట్టి యుద్ధానికి పంపిస్తారు. అలా వెళ్ళిన ఇంద్రుడు యుద్ధంలో గెలిచి తిరిగి త్రిలోకాధిపత్యాన్ని సంపాదిస్తాడు. ఆ విధంగా ప్రారంభమైంది రక్షాబంధనం. అప్పటినుండి ఇప్పటివరకు రాఖీ పండుగ ప్రతి ఒక్కరు జరుపుకునే పండుగగా మారింది. 

ఇక నాటి నుండే ఈ పండుగ ఆచారంగా కొనసాగుతుందని పురాణాలు చెబుతున్నాయి.

ఈ కథ మాత్రమే కాదు రక్షాబంధనం గురించి ఇంకా బోలెడన్ని పురాణ కథలు ప్రచారంలో ఉన్నాయి.

మరి కొన్ని కథలు

శ్రీకృష్ణుడు… శిశుపాలుని శిక్షించే క్రమంలో సుదర్శన చక్రాన్ని ప్రయోగించిన కృష్ణుడు చూపుడువేలుకు గాయం కావడంతో అది గమనించిన ద్రౌపది తన పట్టు చీర కొంగు చూపి కృష్ణుడి చేతికి కట్టు కట్టిందట. అప్పుడు శ్రీకృష్ణుడు ఎల్లవేళలా అండగా ఉంటానని ద్రౌపదిహామీ అందుకు ప్రతిగా దుశ్శాసనుడు దురాగతం నుండి ఆమెను శ్రీకృష్ణుడు కాడా కాపాడారని పురాణాలు చెబుతున్నాయి. 

ఇక  శ్రీ మహావిష్ణువు బలిచక్రవర్తి కోరిక మేరకు అతనితోపాటు పాతాళలోకానికి వెళ్లిన ఉండిపోగా, విష్ణు తీసుకువెళ్లడానికి వచ్చిన లక్ష్మీదేవి బలిచక్రవర్తికి రక్షాబంధనాన్ని కట్టి , రక్షాబంధనాన్ని కట్టిన తనకు రక్షణ కల్పించమని లక్ష్మీదేవి బలిచక్రవర్తిని కోరుతుంది. బలి చక్రవర్తి సోదరుడిగా తనకు రక్షాబంధనాన్ని కట్టిన సోదరికి బహుమానంగా విష్ణుమూర్తిని పంపుతాడు. దీంతో లక్ష్మీదేవి తన భర్తను వైకుంఠానికి తీసుకొని పోతుంది. అంతటి శక్తివంతమైన బంధనం కాబట్టి రక్షాబంధనానికి ఇంతటి చరిత్ర ఉంది. అంతటి విశిష్టత గల రాఖీ పండుగను ఈనాటికీ ప్రతి ఒక్కరు రాఖీ పండుగను జరుపుకుంటున్నారు. 

రాఖీ పౌర్ణమి ఎందుకు .. ఎలా జరుపుకుంటారు?

హిందూ సాంప్రదాయం ప్రకారం శ్రావణ మాసంలో జరుపుకునే ఈ పండుగను మన దేశ వ్యాప్తంగా సోదరులు సోదరీమణులు తమ మధ్య ఉన్న ప్రేమానురాగాలకు ప్రతీక గా జరుపుకుంటారు. సమాజంలో మానవతా విలువలు మంటగలుస్తున్న ఈ  రోజుల్లో రాఖీ పౌర్ణమి వంటి పండుగలు జరుపుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సోదర సోదరీమణుల మధ్య ఉండే అనుబంధానికి, ప్రేమానురాగాలకు అద్దం పట్టే పండుగ రాఖీ పండుగ కావడంతో మానవ సంబంధాల మెరుగుదలకు, విచక్షణకు ఈ పండుగ దోహదం చేస్తుంది.

 రాఖీ పండుగను రక్తం పంచుకుని పుట్టిన సోదర సోదరీమణుల మధ్య జరుపుకోవాలని లేదు ఏ బంధుత్వం ఉన్నా లేకపోయినా సోదరుడు, సోదరి అన్న భావన ఉన్న ప్రతి ఒక్కరూ రక్షాబంధనాన్ని కట్టి వారి క్షేమాన్ని కోరుకోవచ్చు. ఆత్మీయుల మధ్య అనుబంధాలకు, ఐకమత్యానికి, పరస్పర సహకారానికి చిహ్నంగా రక్షాబంధనం నిలుస్తుంది. రాఖీ పండుగ రోజు ఉదయాన్నే తలస్నానం చేసి కొత్త బట్టలు వేసుకొని, రాఖీ కట్టడానికి సిద్ధమవుతారు సోదరీమణులు. సోదరులు కూడా తమ ప్రియమైన సోదరీమణులు కట్టే రాఖీలను స్వీకరించి వారిని సంతోష పపెట్టేలా వారికి బహుమానం ఇవ్వడానికి రెడీ అవుతారు. 

 రాఖీ కట్టేటప్పడు చదవాల్సిన శ్లోకం..

“యేన బద్ధో బలీ రాజా దానవేంద్రో మహాబలః
 తేన త్వామభి బద్నామి రక్ష మాచల మాచల” అనే శ్లోకాన్ని చదివి రాఖీ కడతారు. 

ఆ తరువాత హారతి ఇచ్చి, నుదుటన బొట్టు పెట్టి స్వీట్ తినిపిస్తారు. చెల్లెలు అన్న ఆశీర్వాదాన్ని.. అక్క అయితే తమ్ముళ్లకు ఆశీస్సులను అందిస్తారు. నిండు నూరేళ్లు సుఖంగా జీవించమని దీవిస్తారు. నీకు నేను ఎప్పుడూ రక్ష అని చెప్తూనే, నాకు నువ్వు రక్షణగా ఉండాలని ధర్మాన్ని రక్షాబంధనంతో బోధిస్తారు. ఇక రక్షా బంధనం రోజు సోదరులు ఇచ్చే బహుమతులంటే సోదరీ మణులకు ఎనలేని ప్రేమ . వారికి ఇచ్చే బహుమతి ఏదైనా ఎంతో ప్రేమగా దాచుకుంటారు. ..తీపి జ్ఞాపకంగా భావిస్తారు.

రక్షా బంధన్ రోజున చంద్రుడుతో సహా నవగ్రహాలను పూజిస్తే జాతకంలో ఎలాంటి దోషాలు తొలగిపోతాయని ఆరోజు నవగ్రహాల శాంతి తో చేపట్టిన పనులు నిర్విఘ్నంగా కొనసాగుతాయని చెప్తారు.

Join WhatsApp Channel