గోగా నవమి ఉత్తర భారతదేశంలో జరుపుకునే ప్రసిద్ద పండుగ. ఇది హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, హర్యానా, రాజస్థాన్ మరియు ఉత్తరప్రదేశ్‌లలో ప్రత్యేకంగా జరుపుకునే ఉత్సవం. హిందూ క్యాలెండర్ ప్రకారం శ్రావణ మాసపు కృష్ణ పక్ష నవమి తిథి , లేదా తొమ్మిదవ రోజున ప్రారంభించి మూడురోజుల పాటు జరుపుకుంటారు. ఈ సంవత్సరం గోగా నవమి ఆగస్టు 27న వచ్చింది.
ఈ పండుగను పాము దేవతగా శివుని అవతారంగా భావించే గోగాజీకి అంకితం చేస్తారు. గోగా బాబాగా పిలువబడే ఈ దైవం ధైర్యం, బలం మరియు రక్షణకు చిహ్నంగా భావించబడుతుంది. ఉత్తర భారత జానపద కథల ప్రకారం, గోగా ఒక రాజపుత్ర కుటుంబంలో జన్మించాడని మరియు గొప్ప యోధుడు అని నమ్ముతారు. అతను విష సర్పాల నుంచి, విష ప్రాణుల నుంచి తమ బిడ్డలను రక్షించగలడని జానపద కథల ద్వారా తెలుప బడింది. అందుకే, వివాహిత స్త్రీలు తమ పిల్లల రక్షణ కోసం గోగ నవమిని ఆచరిస్తారు. ఈ రోజున, పిల్లల కోసం ఆరాటపడే కొంతమంది వివాహిత స్త్రీలు భక్తితో ప్రార్థిస్తారు.
రాజపుత్ర సైనికుడిగా సేవ చేయడానికి తన జీవితాన్ని అంకితం చేసిన సాధువుగా శ్రీ గోగాజీ మహారాజ్ పరిగణించబడతారు. అతను ప్రత్యేకమైన అతీంద్రియ సామర్థ్యాలను కలిగి ఉన్నాడని నమ్ముతారు.
హిమాచల్ ప్రదేశ్ లోని కొన్ని ప్రాంతాలలో, శ్రావణ పూర్ణిమ నుండి ప్రారంభమయ్యే ఈ ఉత్సవాలు నవమి వరకు కొనసాగుతాయి. ఉత్సవాలు తొమ్మిది రోజుల పాటు గూగా మారి దేవాలయాల్లో అత్యంత వైభవంగా జరుగుతాయి. అన్ని రకాల ఆపదల నుంచి రక్షణగా భక్తులు భగవంతుని సమక్షంలో రాఖీ లేదా రక్షా స్తోత్రాన్ని కట్టుకుంటారు. శ్రావణ మాసపు కృష్ణ పక్ష పదకొండవ రోజున తర్పణాలతో ఈ పండుగ ముగుస్తుంది.