- బంగ్లాదేశ్ తరహాలోనే భారత్‌కు కూడా ‘జీరో డ్యూటీ’ యాక్సెస్.
- అమెరికా పత్తి లేదా దారంతో తయారైన వస్త్రాలకే ఈ మినహాయింపు.
- బంగ్లాదేశ్ డీల్ వల్ల భారత ఎగుమతులు దెబ్బతింటాయన్న ఆందోళనలకు చెక్.
- రైతుల ప్రయోజనాలకు ఎటువంటి భంగం కలగదని మంత్రి భరోసా.
అమెరికాతో కుదుర్చుకోనున్న వాణిజ్య ఒప్పందంలో భారత వస్త్ర పరిశ్రమకు కూడా బంగ్లాదేశ్‌కు కల్పించినట్లుగానే ‘జీరో డ్యూటీ’ సౌకర్యం లభిస్తుందని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పియూష్ గోయల్ వెల్లడించారు. ఈ నిర్ణయం భారత టెక్స్‌టైల్ రంగానికి నూతనోత్సాహాన్ని ఇవ్వనుంది
అమెరికా-బంగ్లాదేశ్ మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందం భారతీయ ఎగుమతిదారులలో ఆందోళన రేకెత్తించింది. ఆ ఒప్పందం ప్రకారం, బంగ్లాదేశ్ అమెరికా నుంచి ముడిసరుకును కొనుగోలు చేసి, వస్త్రాలను తయారు చేసి తిరిగి అమెరికాకు ఎగుమతి చేస్తే, వాటిపై ఎటువంటి పన్ను ఉండదు. దీనివల్ల భారతీయ వస్త్రాలు అమెరికా మార్కెట్‌లో పోటీని తట్టుకోలేవని విశ్లేషణలు వచ్చాయి.
ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి పియూష్ గోయల్ స్పందిస్తూ.. “వాణిజ్య ఒప్పందంలో బంగ్లాదేశ్‌కు ఏ సౌకర్యం దక్కిందో, భారత్‌కు కూడా అదే సౌకర్యం లభిస్తుంది” అని స్పష్టం చేశారు. ఫైనల్ అగ్రిమెంట్‌లో ఈ అంశం స్పష్టంగా ఉందని ఆయన తెలిపారు.
ఈ ‘జీరో డ్యూటీ’ సౌకర్యం పొందాలంటే ఒక షరతు ఉంది. భారతీయ తయారీదారులు అమెరికాలో ఉత్పత్తి అయిన పత్తిని లేదా సింథటిక్ ఫైబర్‌ను ఉపయోగించి వస్త్రాలను తయారు చేయాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే ఆ ఉత్పత్తులపై పన్ను మినహాయింపు లభిస్తుంది. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ముసాయిదా ప్రకారం, సాధారణ భారతీయ వస్త్ర ఎగుమతులపై 18% సుంకం ఉండొచ్చు, కానీ అమెరికా ముడిసరుకుతో తయారైన వాటికి మాత్రం పూర్తి పన్ను మినహాయింపు లభించే అవకాశం ఉంది.
అమెరికా పత్తిని వాడటం వల్ల భారతీయ పత్తి రైతులకు నష్టం వాటిల్లుతుందన్న ఆరోపణలను గోయల్ ఖండించారు. భారత్ తన అవసరాల కోసం ఇప్పటికే కొంతమేర పత్తిని దిగుమతి చేసుకుంటోందని, అమెరికా పత్తి ఉత్పత్తి పరిమితంగానే ఉందని, కాబట్టి దేశీయ రైతులపై దీని ప్రభావం ఉండదని ఆయన భరోసా ఇచ్చారు.

