క్వెట్టా: పాకిస్థాన్‌లోని నైరుతి ప్రావిన్స్ అయిన బలూచిస్తాన్‌లో ఆదివారం మిలిటరీ బలగాలతో వెళ్తున్న రైలులక్ష్యంగా భారీ పేలుడు జరిగింది. ఈ బాంబు దాడిలో మరణించిన వారి సంఖ్య 24 కు చేరుకుంది. మరో 80 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు.
ఉదయం 8.00 గంటల ప్రాంతంలో క్వెట్టా కంటోన్మెంట్ నుండి పెషావర్‌కు బయలుదేరిన ‘జాఫర్ ఎక్స్‌ప్రెస్’ (Jaffar Express) అనుబంధ రైలును చమన్ ఫాటక్ (Chaman Phatak) రైల్వే స్టేషన్ సమీపంలో పేలుడు పదార్థాలతో నిండిన ఒక కారుతో ఆత్మాహుతి దళ సభ్యుడు నేరుగా రైలు బోగీకి ఢీకొట్టాడు.
ఈ పేలుడు ధాటికి రైలులోని ఒక బోగీ పూర్తిగా అగ్నికి ఆహుతవ్వగా, పట్టాలు తప్పిన మరికొన్ని బోగీలు బోల్తా పడ్డాయి. పేలుడు తీవ్రతకు ఘటనా స్థలంలోని పార్కింగ్‌లో ఉన్న పది వాహనాలు ధ్వంసమయ్యాయి. చుట్టుపక్కల ఉన్న ఇళ్లు, భవనాల అద్దాలు పగిలిపోయాయి. పేలుడు అనంతరం ఆ ప్రాంతంలో భారీగా కాల్పుల మోత కూడా వినిపించినట్లు స్థానికులు తెలిపారు.
ఈ దారుణ కాండకు తమదే బాధ్యత అని వేర్పాటువాద సంస్థ ‘బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ’ (BLA) ప్రకటించింది. BLA కు చెందిన ఆత్మాహుతి దళం ‘మజీద్ బ్రిగేడ్’ (Majeed Brigade) ఈ దాడిని అత్యంత పక్కా ప్రణాళికతో అమలు చేసినట్లు ఒక ప్రకటనలో తెలిపింది. పాకిస్థాన్ సైన్యం లక్ష్యంగానే తమ ఆత్మాహుతి దళ సభ్యుడు ఈ దాడికి పాల్పడ్డాడని వారు పేర్కొన్నారు.



