Maldives election: చిత్తుగా ఓడిన భారత్ అనుకూల పార్టీలు.. ఇక మాల్దీవ్స్ పూర్తిగా చైనా వశం!

ఆదివారం మాల్దీవుల ఎన్నికలలో చైనా అనుకూల ప్రస్తుత మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జూ పార్టీ అఖండ విజయం సాధించింది. ఆయనకు చెందిన పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్ (పిఎన్‌సి) 93 స్థానాలకు గాను 70 స్థానాలను గెలుచుకుని పార్లమెంటులో పూర్తి మెజారిటీ సాధించిందని స్థానిక మీడియా చెప్పింది. ఈ ఎన్నికల ద్వారా సాంప్రదాయ మిత్రదేశమైన భారతదేశం నుండి దూరమై చైనాకు అనుకూలంగా మారాలన్న ముయిజ్జూ ఆలోచనకు ఆ దేశ ప్రజలు కూడా మద్దతు ఇచ్చినట్లు తెలుస్తోంది.

మాజీ అధ్యక్షుడు ఇబ్రహీం మొహమ్మద్ సోలిహ్ నేతృత్వంలోని భారత్ అనుకూల ప్రధాన ప్రతిపక్షం మాల్దీవియన్ డెమోక్రటిక్ పార్టీ (MDP) బలం పార్లమెంట్‌లో ప్రస్తుతం ఉన్న 65 స్థానాలనుంచి  15 సీట్లకు పడిపోయింది.

ప్రస్తుత పార్లమెంట్ లో ముయిజ్జూ పార్టీ అయిన PNC మరియు దాని మిత్రపక్షాలకు కేవలం ఎనిమిది సీట్లు మాత్రమే ఉన్నాయి. దీనితో ఆయన తన చైనా అనుకూల వైఖరితో ముందుకి వెళ్లలేక పోయారు. ఇక ఇప్పుడు వచ్చిన ఈ అఖండ విజయంతో ఆయన తన విధానాలతో ముందుకి దూసుకు పోయే అవకాశం ఉంది. 

ఈ ఎన్నికల ఫలితాలు భారత్ కు ఒక తీవ్రమైన ఎదురుదెబ్బగా భావించవచ్చు.  మాల్దీవుల్లో తమ సైనిక స్థావరాలు ఏర్పాటు చేసుకుని చైనా భారత్ పై నిఘా పెంచే అవకాశం ఉంది.

 

Join WhatsApp Channel