కేరళలోని కోజికోడ్‌కు చెందిన దీపక్ (42) ఆత్మహత్య కేసులో ప్రధాన నిందితురాలైన సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ షిమ్జితా ముస్తాఫాను కేరళ పోలీసులు బుధవారం (జనవరి 21, 2026) అరెస్ట్ చేశారు.
గత శుక్రవారం (జనవరి 16), కన్నూర్ జిల్లాలో ప్రయాణిస్తున్న ఒక ప్రైవేట్ బస్సులో దీపక్ తనను అసభ్యంగా తాకాడంటూ షిమ్జితా ఒక వీడియో తీసింది. ఈ వీడియోను ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేయగా, అది దాదాపు 20 లక్షలకు పైగా వ్యూస్‌తో వైరల్ అయ్యింది.
వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు దీపక్‌ను తీవ్రంగా విమర్శించారు. తాను ఏ తప్పూ చేయలేదని, బస్సులో రద్దీ కారణంగా అనుకోకుండా తగిలి ఉండవచ్చని దీపక్ తన సన్నిహితులతో మొరపెట్టుకున్నప్పటికీ ఫలితం లేకపోయింది.
తనకు ఎదురైన అవమానాన్ని తట్టుకోలేక, తీవ్ర మనస్తాపానికి గురైన దీపక్ ఆదివారం (జనవరి 18) ఉదయం తన నివాసంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.
కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు పలువురిని విచారించగా బస్సు సిబ్బంది (కండక్టర్ మరియు డ్రైవర్) ఇచ్చిన స్టేట్‌మెంట్ ప్రకారం, ప్రయాణ సమయంలో షిమ్జితా ఎటువంటి గొడవ చేయలేదు లేదా ఫిర్యాదు కూడా ఇవ్వలేదు. ప్రాథమిక దర్యాప్తులో షిమ్జితా పోస్ట్ చేసిన వీడియో ఎడిట్ చేయబడిందని పోలీసులు గుర్తించారు. ఆమె ఫోన్‌ను స్వాధీనం చేసుకుని అసలు వీడియోను పరిశీలించనున్నారు.
దీపక్ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు షిమ్జితాపై ఆత్మహత్యకు ప్రేరేపించినట్లు (Abetment to suicide) కేసు నమోదైంది. ఆమె విదేశాలకు పారిపోకుండా పోలీసులు ‘లుకౌట్ నోటీసు’ కూడా జారీ చేశారు. చివరకు వడకరలోని ఒక బంధువుల ఇంట్లో తలదాచుకున్న ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
మానవ హక్కుల కమిషన్ స్పందన
ఈ ఘటనపై కేరళ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ కూడా స్పందించింది. దీనిపై లోతైన విచారణ జరిపి వారం రోజుల్లో నివేదిక సమర్పించాలని ఉత్తర మండల డీఐజీని ఆదేశించింది. పురుషుల హక్కుల కోసం పోరాడే పలు సంఘాలు కూడా ఈ కేసులో నిందితురాలిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి.

