చెన్నై: డీఎంకే యువనేత ఉదయనిధి స్టాలిన్ జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మిత్రపక్షంగా తమతో కలిసుంటూనే కాంగ్రెస్ పార్టీ తమకు వెన్నుపోటు పొడిచిందని ఆయన సంచలన ఆరోపణలు చేశారు.
చెన్నైలో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఉదయనిధి స్టాలిన్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ వైఖరిని తీవ్రంగా ఎండగట్టారు. తమ పార్టీ కాంగ్రెస్‌కు ఎల్లప్పుడూ వెన్నుదన్నుగా నిలిచిందని, కానీ బదులుగా తమకు దక్కింది నమ్మకద్రోహమేనని ఆవేదన వ్యక్తం చేశారు.
దశాబ్దాలుగా కలిసి ప్రయాణిస్తున్నప్పటికీ, కీలక సమయాల్లో డీఎంకే పార్టీని దెబ్బతీసేలా కాంగ్రెస్ వ్యవహరించిందని, మిత్రధర్మాన్ని ఉల్లంఘించి వెన్నుపోటు పొడిచిందని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీకి రాజకీయ విశ్వసనీయత లేదని, భవిష్యత్తులో ఆ పార్టీని ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మకూడదని ఆయన ప్రజలకు మరియు పార్టీ క్యాడర్‌కు పిలుపునిచ్చారు.
“బీజేపీ వరుస విజయాలకు కాంగ్రెస్ పార్టీయే కారణం అని ఇప్పుడు అర్థమవుతోంది. లోక్‌సభ ఎన్నికల నుండి మొన్నటి అసెంబ్లీ ఎన్నికల వరకు కాంగ్రెస్ నేతలను మా భుజాలపై మోశాం. ఎన్నికల ప్రచారంలో కనీసం కనబడని కాంగ్రెస్.. డీఎంకే క్యాడర్ కష్టంతో, ఎం.కే. స్టాలిన్ ఇమేజ్‌తో ఐదు సీట్లు గెలుచుకుని, ఇప్పుడు అధికార దాహంతో రాత్రికి రాత్రే పార్టీ ఫిరాయించింది” అని ఉదయనిధి మండిపడ్డారు. రాజ్యసభ సీటును సైతం డీఎంకే దయాదాక్షిణ్యాలతో పొందిన కాంగ్రెస్.. కనీస రాజకీయ విశ్వసనీయత లేకుండా ఇప్పుడు ఇలా వ్యవహరించడం దుర్మార్గమని ఆయన విమర్శించారు.
రాష్ట్ర ప్రయోజనాల సాధనలో డీఎంకే ఎవరికీ తలొగ్గే ప్రసక్తే లేదని, సొంత బలంతోనే ద్రవిడ సిద్ధాంతాలను ముందుకు తీసుకువెళ్తామని ఆయన స్పష్టం చేశారు.



