శోభా సురేంద్రన్‌: కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఆశలన్నీ ఆమెపైనే

తిరువనంతపురం: కేరళ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో రాష్ట్రంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఇందులో పాలక్కాడ్ నియోజకవర్గంలో పరిస్థితి రసవత్తరంగా ఉంది. అక్కడ బీజేపీ తమ ఫైర్‌బ్రాండ్ ...

తిరువనంతపురం: కేరళ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో రాష్ట్రంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఇందులో పాలక్కాడ్ నియోజకవర్గంలో పరిస్థితి రసవత్తరంగా ఉంది. అక్కడ బీజేపీ తమ ఫైర్‌బ్రాండ్ నాయకురాలు శోభా సురేంద్రన్‌ను బరిలో దింపగా, కాంగ్రెస్ పార్టీ ప్రముఖ నటుడు రమేశ్ పిషారోడి ప్రజాదరణపై నమ్మకం ఉంచింది. ఇక అధికార సీపీఎం నేతృత్వంలోని ఎల్‌డీఎఫ్ ‘రావుత్తర్ బిర్యానీ’ వ్యవస్థాపకుడు, వ్యాపారవేత్త ఎన్.ఎం.ఆర్. రజాక్‌ను తమ స్వతంత్ర అభ్యర్థిగా ప్రకటించింది.

కేరళ అసెంబ్లీపై కమలం ఆశలన్నీ ఆమెపైనే..

2021 ఎన్నికల్లో తమ ఏకైక సిట్టింగ్ స్థానం (నెమమ్) కోల్పోయి చట్టసభకు దూరమైన బీజేపీ.. ఈ దఫా ఎలాగైనా పాలక్కాడ్‌లో గెలిచి కేరళ అసెంబ్లీలో మళ్లీ అడుగుపెట్టాలని పట్టుదలతో ఉంది.

ప్రజల్లో బలమైన నాయకురాలిగా, అనర్గళంగా ప్రసంగించగల నేతగా శోభా సురేంద్రన్‌కు పేరుంది. 1990ల నుంచే పార్టీ పూర్తిస్థాయి కార్యకర్తగా పనిచేస్తున్న ఆమె 2014 లోక్‌సభ ఎన్నికల్లో పాలక్కాడ్ నుంచి పోటీ చేసారు. అక్కడ పార్టీ ఓట్లను ఏకంగా 68,804 (2009లో) నుంచి 1,36,587 కు (6.3 శాతం పెరుగుదల) పెంచి బీజేపీని బలమైన పోటీదారుగా నిలబెట్టారు. అలాగే, 2016 అసెంబ్లీ ఎన్నికల్లో 40,087 ఓట్లతో ఆమె రెండో స్థానంలో నిలిచారు. అంతేకాదు, ఇటీవల 2024 లోక్‌సభ ఎన్నికల్లో అలప్పుజా నుంచి పోటీ చేసి, బీజేపీ ఓటు బ్యాంకును ఏకంగా 11 శాతం పెంచారు. ఆ నియోజకవర్గాన్ని బీజేపీకి ‘ఏ-క్లాస్’ స్థానంగా మార్చడంలో ఆమెది కీలక పాత్ర.

త్రిముఖ పోరులో వ్యూహాలెవరివి?

ఎన్.ఎం.ఆర్. రజాక్‌ను బరిలోకి దించడం ద్వారా మైనార్టీ ఓట్లను చీల్చాలన్నది సీపీఎం వ్యూహంగా కనిపిస్తోంది. ఇది ఈ కఠినమైన త్రిముఖ పోరులో తమకు లాభం చేకూరుస్తుందని బీజేపీ ఆశిస్తోంది. మరోవైపు, కాంగ్రెస్ ఎమ్మెల్యే రాహుల్ మామ్కూత్తతిల్‌పై ఇటీవల లైంగిక ఆరోపణలు రావడం ఆ పార్టీని కొంత ఆత్మరక్షణలో పడేసింది. ఈ ప్రతికూల పరిస్థితులను, అడ్డంకులను అధిగమించి యూడీఎఫ్ మళ్లీ పుంజుకుంటుందా లేదా అనేది ఈ ఎన్నికల్లో తేలనుంది.

Join WhatsApp Channel