కాకినాడ జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గం చుట్టూ రాజకీయం అల్లుకుంటోంది. దీనికి కారణం అక్కడ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారని వార్తలు రావడమే!
పిఠాపురంలో 2019 ఎన్నికలలో వైసీపీ అభ్యర్ధి పెండెం దొరబాబు విజయం సాధించారు. పవన్ కళ్యాణ్ గాజువాక, భీమవరం రెండుచోట్లా పోటీచేసి ఓడారు. నిజానికి ఈ నియోజకవర్గంలో తమ కుటుంభానికి సీటు ఆశించారు కాపు నేత ముద్రగడ పద్మనాభం. అయితే వైసీపీ తరపున అక్కడ కాకినాడ ఎంపీ వంగా గీతను ఎంపిక చేశారు.
ప్రస్తుతం ఇక్కడ పవన్ పోటీ చేస్తారు అనే వార్తలు వస్తున్నాయి. దీనితో వైసీపీ అధినేత జగన్ వ్యూహం మార్చుకుంటున్నారు. నిన్ననే పిఠాపురం ఇంచార్జ్ వంగా గీతను తాడేపల్లి పిలిపించారు. ఒకవేళ పవన్ అక్కడి నుంచి పోటీ చేస్తే ఎలాగైనా ఓడించాలని పావులు కదుపుతోంది. అక్కడ టిడిపి సీటు ఆశించిన వర్మను, ముద్రగడను వైసీపీలోకి తీసుకువచ్చే ఏర్పాట్లలో ఉంది. నిజానికి వర్మ గతంలో అక్కడ ఇండిపెండెంట్ గా విజయం సాధించారు. దీనితో ఆయనకు అక్కడ ప్రజాబలం ఉందని తెలుస్తోంది. ఒకవేళ పవన్ పిఠాపురంనుంచి పోటీ చేస్తే తాను ఇండిపెండెంట్ గా పోటీ చేసే అవకాశం ఉందని ఇటీవలే వర్మ చెప్పినట్లు వార్తలు వచ్చాయి. దీనితో ఎలాగైనా ఆయనను వైసీపీ నుంచి పోటీ చేయిస్తే ఎలా ఉంటుంది అని, లేదా ముద్రగడ కుమారుడికి సీటు ఇచ్చే అంశం కూడా వైసీపీ అధిష్టానం తీవ్రంగా ఆలోచిస్తుంది.