Rao IAS: సెల్లార్ లోకి వరద నీరు..తెలంగాణా అమ్మాయితో సహా ముగ్గురు విద్యార్థులు మృతి

Photo of author

Eevela_Team

Share this Article

భారీ వర్షాలలో వరదలు రావడంతో పాత ఢిల్లీ, రాజేందర్ నగర్‌లోని ఓ కోచింగ్ సెంటర్‌లో ముగ్గురు విద్యార్థులు మృతి చెందారు. ఈ ఘటనలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన శ్రేయా యాదవ్, తెలంగాణకు చెందిన తాన్యా సోని, కేరళకు చెందిన నివిన్ డాల్విన్‌గా గుర్తించారు. ఇప్పటికే కోచింగ్ సెంటర్ యజమాని, కోఆర్డినేటర్‌ను పోలీసులు అరెస్టు చేశారు.

RAO-IAS Floods
RAO-IAS Floods

సహాయక బృందాలు ఏడు గంటల పాటు శ్రమించి ఆదివారం ఉదయం ముగ్గురు విద్యార్థుల ఈ మృతదేహాలను వెలికితీశాయి. అయితే అసలు సెల్లార్ లోకి విధ్యార్ధులు ఎందుకు వెళ్లారు? వీరు వర్షం నీటిలో నుంచి ఎందుకు బయటపడలేకపోయారు? అనే విషయాలు అనేక అనుమానాలకు తావిస్తున్నాయి.

సెల్లార్ లో ఒక లైబ్రరీని నిబంధనలకు వ్యతిరేకంగా నిర్వహిస్తున్నారు అని పోలీసులు చెపుతున్నారు. భవన నిర్మాణం పూర్తయ్యాక 2021లో తీసుకున్న సర్టిఫికేట్‌లో సెల్లార్‌ను పార్కింగ్ కోసం మాత్రమే వినియోగిస్తామని భవన యజమాని రాసిచ్చాడని, అయితే అందులో లైబ్రరీని ఏర్పాటు చేయడం నిబంధనలకు విరుద్ధమని ఢిల్లీ మేయర్ షెల్లీ ఒబెరాయ్ పేర్కొన్నారు.

ప్రమాదం ఎలా జరిగింది అంటే

ఢిల్లీలోని ఓల్డ్ రాజేందర్ నగర్‌ పరిసరాల్లో శనివారం సాయంత్రం 5.30 నుంచి రాత్రి 8.30 గంటల మధ్య 31.5 మిమీ వర్షం నమోదైనట్లు వాతావరణ శాఖ చెబుతోంది. రోడ్లు, డ్రైనేజీలు భారీ నీటితో నిండిపోయాయి. ఇదే సమయంలో సమీపంలోని మురుగు కాలువలు పగిలిపోవడంతో వరద నీరంతా ఒక్కసారిగా సెల్లార్‌లోని లైబ్రరీ రూంలోకి ప్రవేశించాయి. 10 నుంచి12 అడుగుల మేర ఒక్కసారిగా నీళ్లు చేరడంతో లైబ్రరీ గదిలో ఉండిపోయిన విద్యార్థులు బయటకు రాలేకపోయారు.

అయితే భవనంలోని కొన్ని గదులకు బయోమెట్రిక్ యాక్సిస్ ఉంటుందని, కరెంటు పోయినపుడు అది పనిచేయక లైబ్రరీ లోపలే ఉండిపోయి ఉంటారని ఘటనను ప్రత్యక్షంగా చూసిన కొందరు విద్యార్థులు విలేఖరులతో అన్నారు.

స్థానిక ఎమ్మెల్యే కారణం: బిజెపి

బీజేపీకి చెందిన న్యూఢిల్లీ ఎంపీ బన్సూరి స్వరాజ్ ఈ ఘటనకు స్థానిక ఎమ్మెల్యే కారణమని ఆరోపించారు. వారం రోజులుగా స్థానికులు మురుగుకాలువలను శుభ్రం చేయాలని ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే దుర్గేష్ పాఠక్‌ను కోరుతున్నా.. ఆయన పట్టించుకోలేదన్నారు.

మెజిస్టీరియల్ విచారణను ఆదేశం..

ఘటనపై విచారణ ప్రారంభించి 24 గంటల్లోగా నివేదిక సమర్పించాలని ఢిల్లీ రెవెన్యూ మంత్రి అతిషి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నరేష్ కుమార్‌ను ఆదేశించారు. ఈ సంఘటన ఎలా జరిగిందో దర్యాప్తు చేయడానికి మెజిస్టీరియల్ విచారణకు ఆదేశించారు. ‘ఈ ఘటనకు బాధ్యులైన వారెవరూ తప్పించుకోలేరు’ అని అతిషి ఎక్స్‌లో పోస్ట్ చేశారు. సెల్లార్లలో వాణిజ్య కార్యకలాపాలు నిర్యహించే సంస్థలపై నగరవ్యాప్తంగా చర్యలు తీసుకోవాలని మేయర్ ఒబెరాయ్ ఆదేశించారు.

Join WhatsApp Channel
Join WhatsApp Channel