J&K Elections: తొలి అభ్యర్ధుల లిస్ట్ ను ప్రకటించిన కొన్ని గంటల్లోనే ఉపసంహరించుకున్న బీజేపీ!

Photo of author

Eevela_Team

Share this Article

శ్రీనగర్: త్వరలో జరగనున్న జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థుల తొలి జాబితాను బీజేపీ విడుదల చేసింది, అయితే వెంటనే దానిని ఉపసంహరించుకుంది.

90 అసెంబ్లీ నియోజకవర్గాలకు మూడు దశల్లో ఎన్నికలు జరగనుండగా, 44 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను బీజేపీ ఈ ఉదయం ప్రకటించింది. బీజేపీ అభ్యర్థుల జాబితాను సోషల్ మీడియాలో షేర్ చేయగా వెంటనే దాన్ని తొలగించింది. మళ్లీ తిరిగి కేవలం 15 మంది అభ్యర్థుల పేర్లతో మరో జాబితాను విడుదల చేసింది.

తొలగించబడిన జాబితాలో ముగ్గురి ప్రముఖుల పేర్లు లేవు. జమ్మూ కాశ్మీర్ బీజేపీ అధ్యక్షుడు రవీందర్ రైనా, మాజీ ఉప ముఖ్యమంత్రులు నిర్మల్ సింగ్, కవీందర్ గుప్తాల పేర్లు ఆ లిస్ట్ లో లేవు. ఈ జాబితాలో కేంద్ర మంత్రి డా. జితేంద్ర సింగ్ సోదరుడు దేవేంద్ర రాణా పేరు కూడా పెట్టారు. నేషనల్ కాన్ఫరెన్స్ నుంచి బీజేపీలో చేరారు.

తొలి జాబితాలో ఇద్దరు కశ్మీరీ పండిట్‌లు, 14 మంది ముస్లిం అభ్యర్థుల పేర్లు ఉన్నాయి. ఇప్పుడు తొలగించబడిన జాబితాలో కనిపించిన వారిలో కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ, పాంథర్స్ పార్టీకి చెందిన పలువురు మాజీ నేతలు పార్టీలు మారి బీజేపీలో చేరారు.

జమ్మూ కాశ్మీర్‌లో సెప్టెంబర్ 19, 25, అక్టోబర్ 1 తేదీల్లో మూడు దశల్లో పోలింగ్ జరగనుంది. అక్టోబర్ 4న ఓట్లను లెక్కించనున్నారు. 2019లో ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎన్నికలు జరగడం ఇదే తొలిసారి. జమ్మూకశ్మీర్‌లో చివరిసారిగా 2014లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. బీజేపీ 25, పీడీపీ 28, ఎన్‌సీ 15, కాంగ్రెస్ 12 సీట్లు గెలుచుకున్నాయి.

Join WhatsApp Channel
Join WhatsApp Channel