ఆంధ్రప్రదేశ్ నలుమూలలా గ్రామ దేవతల ఆరాధన అనాదిగా వస్తోంది. గ్రామ పొలిమేరల్లో ఉంటూ, దుష్ట శక్తుల నుండి ప్రజలను కాపాడే చల్లని తల్లిగా గ్రామ దేవతలను కొలుస్తారు. కృష్ణా జిల్లా, ఉయ్యూరు నడిబొడ్డున కొలువై ఉన్న “శ్రీ వీరమ్మ తల్లి” అమ్మవారు ఆ ప్రాంత ప్రజల పాలిట ఇలవేల్పు. విజయవాడకు సమీపంలో ఉన్న ఉయ్యూరులో వెలసిన ఈ అమ్మవారిని దర్శించుకునేందుకు నిత్యం వందలాది మంది భక్తులు వస్తుంటారు.
శ్రీ పారుపూడి కనక చింతయ్య, వీరమ్మతల్లి దేవాలయం: ఆలయ చరిత్ర మరియు స్థల పురాణం
ఉయ్యూరు వీరమ్మ తల్లి ఆలయానికి ఘనమైన చరిత్ర ఉంది. స్థానిక కథనాలు మరియు చారిత్రక అంశాల ప్రకారం, ఈ ఆలయం ఉయ్యూరు జమీందార్ల కాలం నుండి ప్రసిద్ధి చెందింది. పూర్వం ఈ ప్రాంతాన్ని పాలించిన జమీందార్లు అమ్మవారిని తమ ఆడపడుచుగా భావించి పూజించేవారని ప్రతీతి.
500 ఏళ్ల చరిత్ర గల వీరమ్మ తల్లి, పశ్చిమ గోదావరి జిల్లా పెదకడియం గ్రామంలో జన్మించింది. ఆమె భర్త చింతయ్య హత్యకు గురయ్యాడు. తన భర్త హత్యకు కారణం సుబ్బయ్య అని తెలుసుకుని ,అతని వంశం నిర్వంశం కావాలని శపించింది. సుబ్బయ్య అకస్మాత్తుగా చని పోయాడు. అతనితో అతని వంశము అంతరించింది. వీరమ్మ పుట్టినింటి వారు ఈమెను మళ్ళీ పెళ్లి చేసుకోమని బలవంతపెట్టారు. ఆమెకు కోపం వచ్చి పుట్టినింటి వారిని కూడా ”నిర్వంశం” కావాలని శాపంపెట్టింది. తరువాత ఆమె సతీ సహగమనానికి ఉయ్యూరు జమీందారు గారు ,గోల్కొండ నవాబు ప్రతినిధి ”జిన్నా సాహెబ్ ”అంగీకరించారు. సహగమనం జరిగిన చోటు లో ఆలయాన్ని నిర్మించారు. చెరువు తవ్వించారు. వీరమ్మ, చింతయ్యల విగ్రహాలను ఉయ్యాల స్తంభాలను తయారు చేయించారు. జిన్నా గారు, జమీందారు గార్ల సమక్షంలో భక్త జన సందోహం మధ్య వైభవంగా ప్రతిష్ట జరిగింది .
నాటి నుండి నేటి వరకు, ఊరిలో ఏ శుభకార్యం జరిగినా మొదట వీరమ్మ తల్లిని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ముఖ్యంగా ఉయ్యూరు సంస్థానాధీశులు అమ్మవారి ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేవారు, ఆ సంప్రదాయం నేటికీ కొనసాగుతోంది.
అమ్మవారి విశిష్టత మరియు మహిమలు
వీరమ్మ తల్లిని శక్తి స్వరూపిణిగా కొలుస్తారు. “వీర” అంటే ధైర్యం, “అమ్మ” అంటే తల్లి. భక్తుల కష్టాలను పోగొట్టి, ధైర్యాన్ని, స్థైర్యాన్ని ఇచ్చే తల్లిగా ఆమె ప్రసిద్ధి చెందింది. పిల్లలు లేని దంపతులు అమ్మవారిని భక్తిశ్రద్ధలతో పూజించి, ఆలయంలో ముడుపు కడితే సంతానం కలుగుతుందని ప్రగాఢ విశ్వాసం. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడేవారు అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తే రోగాలు నయమవుతాయని భక్తులు నమ్ముతారు.అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలతో పాటు, పసుపు-కుంకుమలు, గాజులు సమర్పించుకుంటారు. ముఖ్యంగా ఆది, మంగళ, శుక్రవారాల్లో ఆలయం భక్తులతో కిటకిటలాడుతుంది.
కన్నుల పండుగగా వీరమ్మ తల్లి తిరునాళ్లు
ఏటా మాఘ శుద్ధ ఏకాదశి నుంచి 15 రోజుల పాటు తిరునాళ్లు నిర్వహిస్తున్నారు. ఉయ్యాల ఊయింపు ప్రత్యేక సంప్రదాయం. లక్షలాది మంది భక్తులు ఈ తిరునాళ్లలో పాల్గొంటారు. ఉయ్యూరు వీరమ్మ తల్లి తిరునాళ్లు అంటే కృష్ణా జిల్లా అంతటా పండగ వాతావరణమే. ప్రతి ఏటా అత్యంత వైభవంగా జరిగే ఈ ఉత్సవాలకు రాష్ట్ర నలుమూలల నుండి లక్షలాదిగా భక్తులు తరలివస్తారు. తిరునాళ్లలో ప్రధాన ఆకర్షణ “సిరిబండి”. అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని ప్రత్యేకంగా అలంకరించిన సిరిబండిపై ఉంచి ఊరేగిస్తారు. ఈ దృశ్యాన్ని చూడటానికి భక్తులు రెండు కళ్లు చాలవు. భక్తులు తమ మొక్కుబడులు తీర్చుకోవడానికి తలపాగాలతో, ఘటాలతో ఊరేగింపుగా ఆలయానికి వస్తారు. డప్పు వాయిద్యాలు, కోలాటాలు, పోతురాజుల విన్యాసాలు ఈ జాతరలో ప్రత్యేక ఆకర్షణ. చుట్టుపక్కల గ్రామాల నుండి భారీ ఎత్తున విద్యుత్ ప్రభలను అలంకరించి అమ్మవారి సన్నిధికి తీసుకువస్తారు. రాత్రి వేళల్లో ఈ ప్రభల కాంతుల్లో ఉయ్యూరు పట్టణం మెరిసిపోతుంది.
ఎలా చేరుకోవాలి?
విజయవాడ నుండి సుమారు 30-35 కిలోమీటర్ల దూరంలో ఉయ్యూరు ఉంటుంది. విజయవాడ లేదా మచిలీపట్నం నుండి బస్సు సౌకర్యం పుష్కలంగా ఉంది. సమీప రైల్వే స్టేషన్ విజయవాడ జంక్షన్. గన్నవరం విమానాశ్రయం నుండి క్యాబ్ ద్వారా సులభంగా చేరుకోవచ్చు.

