గత కొద్ది రోజులుగా మీడియాలో సంచలనాలతో రోజుకో మలుపు తిరుగుతున్న వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ – వాణి వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. ఈరోజు శ్రీనివాస్ భార్య వాణి సంచలన వ్యాఖ్యలు చేసారు. “ఆయన ఎలా తిరిగినా పరవాలేదు.. నాకు డబ్బూ వద్దు .. ఆస్తీ వద్దు .. ఆయనతో ఈ ఇంట్లోనే ఉంటాను… పిల్లల కోసం” అన్నారామె.
చాలాకాలం నుంచే ఈ భార్యాభర్తల మధ్య వివాదం నడుస్తున్నా కొద్ది రోజులుగా ఆమె శ్రీనివాస్ ఉంటున్న ఇంటి ముందు దీక్ష చేపట్టి తనను ఇంట్లోకి రానివ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. భర్తపై తీవ్ర ఆరోపణలతో మీడియాలతో పదే పదే చర్చా సమావేశాలు పెడుతూ ఉన్నారు. చివరికి బందువుల జోక్యంతో ఐదు డిమాండ్లతో శ్రీనివాస్ ముందు పెట్టారు. అయితే దాదాపు అన్ని డిమాండ్లకు ఆయన ఒప్పుకోవడంతో పాటూ ఆమెపై ఎదురుదాడి ప్రారంభించారు.
ఆయనకు తోడు దువ్వాడ సోదరుడు, తల్లి కూడా వాణిపై తీవ్రంగా విరుచుకు పడ్డారు. ఆమె ఆస్తి కోసం .. డబ్బుకోసం నాటకం ఆడుతున్నడని ఆరోపించారు. దీనికి తోడు ఆమె శ్రీనివాస్ తో అక్రమ సంబంధం ఉందని చెప్పిన దివ్వెల వాణి భర్త కూడా తన భార్యపై తనకు నమ్మకం ఉందని చెప్పడంతో.. రాను రాను ఈ వ్యవహారంలో వాణి కి మద్దతు తగ్గడం .. దువ్వాడ శ్రీనివాస్ కు సానుభూతి పెరగసాగింది.
ఈరోజు మీడియాతో మాట్లాడిన ఆమె దువ్వాడ శ్రీనివాస్, తామూ కలిసి అందరం ఒకే ఇంట్లో ఉండటం ముఖ్యమన్నారు. కలిసి ఉండేందుకు గానూ దువ్వాడ శ్రీను ఎలాంటి షరతులు పెట్టినా అంగీకరిస్తామని చెప్పారు. తన భర్త దువ్వాడ శ్రీనివాస్ ఎలా తిరిగినా తనకు సంబంధం లేదన్న దువ్వాడ వాణి.. కండీషన్లు పెట్టినా అంగీకరిస్తానని చెప్పారు. కుమార్తె పెళ్లి కోసం కలిసి ఉండాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. కూతురి పెళ్లి కోసం, సమాజం కోసం ఒకే ఇంట్లో కలిసి ఉందామని దువ్వాడ శ్రీనివాస్‌ను కోరారు. పిల్లల భవిష్యత్తే తనకు ముఖ్యమన్న వాణి.. దువ్వాడ శ్రీనివాస్ ఎలా తిరిగినా తనకు అవసరం లేదన్నారు. తన పిల్లల భవిష్యత్తే తనకు ముఖ్యమంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.
అనేక విధాలుగా ఆలోచించిన ఆమె ఈరోజు ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారని భావిస్తున్నారు.
ఇంతకీ ఆమె ఏమన్నారంటే
“నా పట్ల, పిల్లల పట్ల తప్పుడు కథనాలు ప్రచారం చేస్తున్నారు. నా పిల్లలు కారం పట్టుకుని, ఆయుధాలు పట్టుకుని వచ్చారంట. ఏ తండ్రయినా అలా చెప్పుకుంటారా అండీ! ఆ రోజు మీడియా అంతా రోడ్డుపైనే ఉంది కదా… నా పిల్లలపై ఎందుకు అలా అభాండాలు వేస్తున్నారు? పిల్లల మీద చెప్పినవాడు భార్య మీద చెప్పడా? ఎన్నయినా చెబుతాడు.
ఒక తప్పుడు సందేశం అనేది ప్రజల్లోకి తీసుకెళుతున్నాడు. రాజకీయ లబ్ధి కోసమే ఇదంతా చేశానని అంటున్నాడు. రాజకీయపరంగా శ్రీను గారు ముందుకు వెళతారులే అనే ఉద్దేశంతో నా కుటుంబ రాజకీయ నేపథ్యాన్ని త్యాగం చేశాను. కానీ ఈ రోజు శ్రీను గారు దాన్ని దుర్వినియోగం చేశారు.
తన పదవిని చూసుకుని, ఈ మధ్య కాలంలో సంపాదించిన డబ్బును చూసుకుని అంత నిర్దాక్షిణ్యంగా ప్రవర్తించడం నాకు ఆశ్చర్యం కలిగిస్తోంది. గతంలో ఆయన ఎన్నో ఎత్తుపల్లాలు ఎదుర్కొన్నారు… కానీ ఎప్పుడూ ఇలా బిహేవ్ చేయలేదు. కానీ కొంతకాలంగా ఏదో జరుగుతోందన్న విషయం ఇటీవల నాకు అర్థమైంది.
ఆయనకో చెడు అలవాటు ఉంది. తన సమస్యలను ఆయన ఎవరితోనూ పంచుకోరు. తన సమస్యలను రకరకాలుగా డైవర్ట్ చేసుకునే మనస్తత్వం ఆయనది. ఆ సమస్యల నుంచి తప్పించుకోవడానికి మాపై బురదజల్లేందుకు ప్రయత్నిస్తున్నారు. అందుకే నేను ఓ నిర్ణయానికి వచ్చాను.
మాకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. ఒకమ్మాయి పెళ్లీడుకు వచ్చింది. ఇక ఆయన ఎలా తిరిగినా, ఎలా ప్రవర్తించినా నేను పట్టించుకోను. పిల్లల బాధ్యత అంతా ఆయనే తీసుకోవాలి. నాకు ఒక్క రూపాయి ఇవ్వకపోయినా ఫర్వాలేదు. ఈ మేరకు ఆయనతో లిఖితపూర్వకంగా రాజీ కుదుర్చుకునేందుకు నేను సిద్ధంగా ఉన్నాను.
పిల్లల పేరు మీద, నా పేరు మీద ఆస్తులు రాయాలని నేను కోరుకోవడంలేదు. నేను, మీరు, పిల్లలు ఒకే ఇంట్లోనే కలిసి ఉందాం… మీరు బయటికి వెళ్లి మీ వ్యక్తిగత జీవితాన్ని ఎలాగైనా చేసుకోండి… మాకు ఎలాంటి అభ్యంతరాలు లేవు… మీరు మాతోనే ఉండండి… ఆ మేరకు ఒప్పంద పత్రం రాసుకుందాం అని శ్రీను గారికి మీడియా ముఖంగా విజ్ఞప్తి చేస్తున్నాను” అంటూ దువ్వాడ వాణి స్పష్టం చేశారు.