ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కర్నూలు జిల్లా సున్నిపెంటలో నిర్వహించిన ‘మన నీరు-మన సంపద’ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ “రాయలసీమలో ప్రతి ఎకరాకు నీరిస్తాం .. ఒకప్పుడు రాయలసీమ రతనాల సీమ.. కొందరు పాలకుల వల్ల రాళ్లసీమగా మారింది.. తిరిగి రతనాల సీమగా మారుస్తా” అన్నారు.
అంతకి ముందు శ్రీశైలం మల్లికార్జునస్వామిని దర్శించుకున్న ఆయన.. ఆ తర్వాత శ్రీశైలం ప్రాజెక్టును సందర్శించి.. కృష్ణా నదికి నది హారతి ఇచ్చారు..
“టీడీపీ హయాంలో సాహునీటి ప్రాజెక్టులకు 60 వేల కోట్లు ఖర్చు చేసాం.. కానీ, వైసీపీ హయాంలో 19 వేల కోట్లు ఖర్చు పెట్టారు .. రాయలసీమలో మేము 12 వేల కోట్లు ఖర్చు చేస్తే, వైసీపీ కేవలం 2 వేల కోట్లు ఖర్చు చేశారు” అని విమర్శించారు. “రాయలసీమలో పనికిరాని పార్టీకి 7 సీట్లు గెలిపించారు.. ఎక్కడో చిన్న లోపం ఉంది” అని వైకాపాను ఉద్దేశించి అన్నారు.
“ఎన్నో హామీలు ఇచ్చాను.. నెరవేర్చాలి, ఖజానా ఖాళీగా ఉంది..సంపద సృష్టించడంలో టీడీపీ ముందుంటుంది.. సంపద సృష్టిస్తా.. అభివృద్ధి, సంక్షేమం ప్రజలకు చేరవేస్తా” అన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.
ఇదే సమయంలో ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఉద్దేశించి మాట్లాడుతూ..” ఈ తీర్పును స్వాగతిస్తున్నామని .. సామాజిక న్యాయం, దామాషా ప్రకారం ప్రతి వర్గానికి న్యాయం చేయడం తెదేపా సిద్ధాంతం. గతంలో నేను వర్గీకరణకు సంబంధించి ఏబీసీడీలుగా కేటగిరీ తీసుకొచ్చాను. అందరికీ న్యాయం జరగాలి. ఎన్నికల్లో టికెట్ల కేటాయింపు కూడా అలాగే చేశాం. ఈ ప్రభుత్వం అందరిది.. మీ అందరివాడిగా ఉంటా’’ అన్నారు.