దేశ చరిత్రలో తొలిసారిగా పూర్తి బడ్జెట్ లేకుండా రెండోసారి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచింది. ఎన్నికల ముందు వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ఈరోజుతో ముగుస్తుండడంతో మరోసారి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను అమలుచేయడానికి చంద్రబాబు సర్కార్ ఆర్డినెన్స్ ను గవర్నర్ కు పంపింది.
ఇంతవరకు రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై స్పష్టత లేకపోవడం, ఇచ్చిన హామీలకు నిధులు ఎలా సమీకరించాలో అర్ధం కాకపోవడంతో వచ్చే నాలుగు నెలల కాలానికి మరోసారి సుమారు 1.30 లక్షల కోట్ల రూపాయల మేర ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఆర్డినెన్సు ను రూపొందించింది. 40 విభాగాలకు చెందిన డిమాండ్ లు, గ్రాంట్ లకు ఆమోదం వచ్చేలా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఆర్డినెన్సుకు మంత్రిమండలి ఆమోదించి గవర్నర్ కు పంపింది.
కాగా.. ఈ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కాలపరిమితి ముగిసిన అనంతరం.. సెప్టెంబర్ లేదా ఆక్టోబర్ నెలలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి పూర్తిస్థాయి బడ్జెట్ పై నిర్ణయం తీసుకోనున్నారు.
సాధారణంగా ప్రతీ సంవత్సరం ఏప్రిల్ 1 నుండి అమలులోకి వచ్చేలాగా బడ్జెట్ ను అసెంబ్లీలో ప్రవేశపెడతారు. అయితే ఎన్నికల కారణంతో గత ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను నాలుగు నెలల కాలానికి ప్రవేశ పెట్టవలసి వచ్చింది. ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం అదే ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను కొనసాగించింది.
అయితే మరోసారి కొత్తగా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను ఆర్డినెన్స్ ద్వారా తీసుకురావడం రాష్ట్ర ఆర్ధిక పరిస్థితికి అద్దం పడుతోంది. మొన్ననే చంద్రబాబు శాసన సభలో “సూపర్ సిక్స్ అంటే భయమేస్తుంది” అని అనడంతో నిధుల సమీకరణపై ఇంకా స్పష్టత లేని విషయాన్ని బయటపెట్టింది.