అనేక మంది AP EAMCET అభ్యర్ధులు కోరినట్లుగా మరో ఫేజ్ కౌన్సెలింగ్ కు నోటిఫికేషన్ విడుదల అయింది. ఇప్పటికే రెండు విడతల్లో ఇంజినీరింగ్ ప్రవేశాలకు కౌన్సెలింగ్ జరుగగా సరిగా ఆప్షన్స్ పెట్టుకోలేని వారు.. నచ్చిన కాలేజీల్లో జాయిన్ కాలేక పోయారు. అలాగే అనేక కాలేజీల్లో సీట్లు కూడా ఖాళీగానే ఉన్నాయి. దీనితో ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి మరో విడత కౌన్సెలింగ్కు నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఈ విషయంపై సాంకేతిక విద్యా శాఖ సంచాలకులు, ప్రవేశాల కన్వీనర్ గణేష్ కుమార్ వివరాలు విడుదల చేశారు. దీని ప్రకారం తుది విడత కౌన్సెలింగ్ కు ఆగస్టు 19వ తేదీ నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఆగస్టు 21 లోపు రిజిస్ట్రేషన్ ప్రక్రియ ముగుస్తుంది.
సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రక్రియ ఆగస్టు 19 నుండి ఆగస్టు 22 వరకు ఉంటుందని కన్వీనర్ గణేష్ కుమార్ పేర్కొన్నారు. ఆగస్టు 20 నుంచి 22 వరకు 3 రోజుల పాటు వెబ్ ఆప్షన్ల ఎంపిక, ఆగస్టు 26 వతేదీన సీట్ల కేటాయింపును పూర్తి చేస్తామని ఆయన ప్రకటించారు.