అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాబోయే నాలుగు రోజుల పాటు నిప్పుల కొలిమిలా మారనుంది. రాష్ట్రవ్యాప్తంగా ఎండల తీవ్రత విపరీతంగా పెరుగుతుందని, రాబోయే నాలుగు రోజుల పాటు పలు జిల్లాల్లో ‘తీవ్ర వడగాల్పులు’ (Severe Heatwave Conditions) వీచే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) హెచ్చరించింది. 11 జిల్లాల్లో ఇప్పటికే ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల మార్కును దాటేశాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరారు.
47.6 డిగ్రీలతో మండిపోతున్న పిడుగురాళ్ల:
రాష్ట్రంలో ఎండల తీవ్రత ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి ఉష్ణోగ్రతల లెక్కలే నిదర్శనం. పల్నాడు జిల్లాలోని పిడుగురాళ్లలో అత్యధికంగా 47.6 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఈ వేసవిలోనే ఇది అత్యధిక రికార్డు.
దీంతో పాటు కృష్ణా జిల్లా కంకిపాడు, మార్కాపురం పరిధిలోని నందనమరెల్ల ప్రాంతాల్లో 46.1 డిగ్రీలు, పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో 46 డిగ్రీల చొప్పున గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. విజయవాడ, అమరావతి పరిసర ప్రాంతాల్లో కూడా సాయంత్రం 4 గంటల సమయంలోనూ ఉష్ణోగ్రత 45 డిగ్రీల పైనే కొనసాగుతుండటం గమనార్హం.
పలు జిల్లాలకు ‘ఆరెంజ్ అలర్ట్’
వాతావరణ శాఖ (APSDMA) రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
- తీవ్ర ప్రభావం చూపే జిల్లాలు: ఎన్టీఆర్, కృష్ణా, పల్నాడు, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, ఏలూరు, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, కోనసీమ, కాకినాడ మరియు అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు 45 నుండి 47 డిగ్రీల వరకు నమోదయ్యే ప్రమాదం ఉంది.
- విపత్తు నిర్వహణ సంస్థ ఎండి ప్రఖార్ జైన్ తెలిపిన వివరాల ప్రకారం.. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 74 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, మరో 232 మండలాల్లో సాధారణ వడగాల్పులు వీచే అవకాశం ఉంది.
- ఉత్తర కోస్తాలో వేడి గాలులు తీవ్రంగా ఉంటాయని, అదే సమయంలో రాయలసీమ ప్రాంతంలో మాత్రం ఉష్ణోగ్రతలు 40 నుండి 43 డిగ్రీల మధ్య ఉండే అవకాశం ఉందని పేర్కొన్నారు.
తీవ్ర ఎండల నేపథ్యంలో రాష్ట్ర పురపాలక శాఖ అన్ని పట్టణ స్థానిక సంస్థలను (ULBs) హై అలర్ట్ చేసింది. మే 20 నుండి మే 26 వరకు ప్రత్యేక నిఘా ఉంచాలని ఆదేశించింది. బస్టాండ్లు, మార్కెట్లు, ఆసుపత్రులు, కార్మికులు ఎక్కువగా ఉండే ప్రాంతాలు మరియు అన్నా క్యాంటీన్ల వద్ద తాగునీటి సదుపాయాలు, చలివేంద్రాలు మరియు కూలింగ్ షెల్టర్లను యుద్ధప్రాతిపదికన ఏర్పాటు చేస్తున్నారు.



