“మీరు ఆపితే మేం ఆపుతాం” ఉక్రెయిన్ విషయంలో రష్యా కీలక ప్రతిపాదన… తిరస్కరించిన అమెరికా

వాషింగ్టన్: ఉక్రెయిన్-రష్యా యుద్ధం, అలాగే మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో రష్యా ఒక సంచలన ప్రతిపాదన చేసినట్లు తెలుస్తోంది. ఇరాన్‌కు సైనిక సమాచారం ఇవ్వడం తాము ఆపేయాలంటే, ...

వాషింగ్టన్: ఉక్రెయిన్-రష్యా యుద్ధం, అలాగే మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో రష్యా ఒక సంచలన ప్రతిపాదన చేసినట్లు తెలుస్తోంది. ఇరాన్‌కు సైనిక సమాచారం ఇవ్వడం తాము ఆపేయాలంటే, ఉక్రెయిన్‌కు అమెరికా కూడా అలాంటి సాయమే నిలిపివేయాలని రష్యా షరతు పెట్టినట్లు ప్రముఖ పత్రిక ‘పొలిటికో’ వెల్లడించింది. అయితే, అమెరికా ఈ ప్రతిపాదనను నిర్ద్వంద్వంగా తిరస్కరించినట్లు ఆ కథనం పేర్కొంది.

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇరాన్‌కు రష్యా గూఢచార సమాచారాన్ని అందిస్తూ వస్తోంది. ముఖ్యంగా మధ్యప్రాచ్యంలో ఉన్న అమెరికా సైనిక స్థావరాల కచ్చితమైన వివరాలు ఇరాన్‌కు రష్యా చేరవేస్తోందని సమాచారం. దీనికి బదులుగా, ఉక్రెయిన్‌పై దాడులు చేయడానికి రష్యాకు అవసరమైన డ్రోన్లను ఇరాన్ సరఫరా చేస్తోంది. ఈ నేపథ్యంలోనే.. “ఉక్రెయిన్‌కు మీరు సైనిక, గూఢచార సమాచారం ఇవ్వడం ఆపేస్తే, మేం ఇరాన్‌కు ఆ సాయం నిలిపివేస్తాం” అని రష్యా అమెరికా ముందు ప్రతిపాదించినట్లు సమాచారం.

మియామీ వేదికగా చర్చలు..

ఈ నెల ప్రారంభంలో మియామీలో జరిగిన చర్చల్లో ఈ ప్రతిపాదన తెరపైకి వచ్చినట్లు తెలుస్తోంది. రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రత్యేక ప్రతినిధి కిరిల్ డిమిత్రియేవ్, అమెరికా ప్రతినిధి స్టీవ్ విట్‌కాఫ్, డొనాల్డ్ ట్రంప్ అల్లుడు జారెడ్ కుష్నర్‌ల మధ్య జరిగిన భేటీలో రష్యా ఈ డీల్ పెట్టినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. కానీ, ఈ ప్రతిపాదనను అమెరికా ఏమాత్రం అంగీకరించలేదని తెలిసింది.

కొట్టిపారేసిన రష్యా.. ఇరాన్‌కు పుతిన్ భరోసా..

అయితే, ‘పొలిటికో’ పత్రిక ప్రచురించిన ఈ కథనాన్ని రష్యా ప్రతినిధి డిమిత్రియేవ్ ‘ఫేక్ న్యూస్’గా కొట్టిపారేశారు. మరోవైపు, ఇరాన్‌కు తాము ఎప్పుడూ అండగా ఉంటామని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ స్పష్టం చేశారు. ఇరానియన్ నూతన సంవత్సరం (నౌరుజ్) సందర్భంగా ఆ దేశ అధ్యక్షుడు, అత్యున్నత నాయకుడికి పుతిన్ శుభాకాంక్షలు తెలుపుతూ.. “ఈ కష్టకాలంలో ఇరాన్‌కు రష్యా నమ్మకమైన స్నేహితుడిగా, భాగస్వామిగా కొనసాగుతుంది” అని ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

కానీ, గత మూడు వారాలుగా ఇజ్రాయెల్, అమెరికా దాడులు చేస్తున్నప్పటికీ.. క్షేత్రస్థాయిలో రష్యా నుంచి తమకు పెద్దగా ఆశించిన స్థాయిలో సాయం అందడం లేదని ఇరాన్ వర్గాలు అంతర్గతంగా పెదవివిరుస్తున్నట్లు ‘రాయిటర్స్’ వార్తాసంస్థ శనివారం ఒక కథనంలో వెల్లడించింది.

Join WhatsApp Channel