ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ప్రతిపక్ష హోదా కల్పించాలంటూ వైసీపీ అధినేత జగన్ దాఖలు చేసిన పిటిషన్‌పై ఈరోజు హైకోర్టులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన న్యాయస్థానం, అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడితో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.
శాసనసభలో తనకు ప్రతిపక్ష నేత హోదా ఇచ్చేందుకు తిరస్కరిస్తూ స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఈ ఏడాది ఫిబ్రవరి 5న ఇచ్చిన రూలింగ్‌ను సవాలు చేస్తూ వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హైకోర్టులో వేసిన పిటిషన్‌లో అనేక కీలక అంశాలను పొందుపరిచారు. గతంలో స్పీకర్, శాసనసభ వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్ తన ప్రతిపక్ష హోదాపై మాట్లాడిన మాటల్ని ఉదాహరించారు.
ఈ రూలింగ్‌ను ఆంధ్రప్రదేశ్ జీత భత్యాలు, పెన్షన్లు, అనర్హతల తొలగింపు చట్టానికి విరుద్ధంగా ప్రకటించాలని…రూలింగ్‌ను రద్దు చేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు.
తనకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వకపోవడంపై గత ఏడాది జూలై 23న హైకోర్టులో పిటిషన్ పెండింగ్‌లో ఉండగానే శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు క్రొత్తగా ఓ రూలింగ్ ఇచ్చారని అందులో వెల్లడించారు. తనకు ప్రతిపక్ష హోదా కల్పించేలా స్పీకర్‌ను ఆదేశించాలని ఆయన తన పిటిషన్‌లో కోరారు. దీనిపై ఇవాళ విచారణ చేపట్టిన హైకోర్టు, విచారణ సందర్భంగా, ప్రతివాదుల జాబితాలో ఉన్న స్పీకర్ అయ్యన్నపాత్రుడు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, శాసనసభ కార్యదర్శి ప్రసన్నకుమార్‌కు ఉన్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. ఈ వ్యవహారంపై తదుపరి విచారణను అక్టోబర్ 4వ తేదీకి వాయిదా వేసింది. కాగా, గతంలో జగన్ దాఖలు చేసిన మరో పిటిషన్‌ను కూడా ఈ కేసుతో కలిపి విచారించాలని న్యాయస్థానం ఆదేశించడం గమనార్హం.
అసెంబ్లీలో తమ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని కోరుతూ జగన్ తొలుత స్పీకర్‌కు లేఖ రాసిన విషయం తెలిసిందే. అయితే, ఆ లేఖపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు రూలింగ్ ఇస్తూ ఆ అభ్యర్థనను తిరస్కరించారు. “ప్రజలు ఇవ్వని ప్రతిపక్ష హోదాను తాము ఎలా కల్పిస్తాం?” అని ఆయన ప్రశ్నించారు. రాజ్యాంగ, అసెంబ్లీ నిబంధనలు ఇందుకు అంగీకరించవని ఆయన స్పష్టం చేశారు.