అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మహిళా సాధికారత మరియు పర్యావరణ పరిరక్షణ దిశగా మరో భారీ అడుగు వేశారు. విద్యార్థినులు మరియు మహిళల కోసం ప్రత్యేకంగా కేవలం 24 గంటల వ్యవధిలో 5,555 ఎలక్ట్రిక్ సైకిళ్లను (e-cycles) పంపిణీ చేసి, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ఈ ఎలక్ట్రిక్ సైకిళ్ల వినియోగం వల్ల మహిళల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సైకిళ్ల ద్వారా ఒక్కో మహిళకు నెలకు సుమారు రూ. 1000 నుండి రూ. 1500 వరకు ఆదా అవుతుందని, ఇది వారికి ఆర్థిక వెసులుబాటును కల్పిస్తుందని తెలిపారు. అంతేకాకుండా, ఇంధన కాలుష్యం లేని ఈ వాహనాలు పర్యావరణ సమతుల్యతను కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తాయని, తద్వారా మహిళల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుందని ఆయన పేర్కొన్నారు.
ఈ ఈ-సైకిళ్ల ప్రత్యేకతలను వివరిస్తూ, వీటిని కుప్పంలోనే అసెంబ్లీ చేశారని సీఎం తెలిపారు. వీటిని ఛార్జ్ చేయడానికి కరెంట్ ఖర్చు లేకుండా, రూఫ్‌టాప్ సోలార్ విధానాన్ని ఉపయోగించుకోవచ్చని చెప్పారు. ఒక్కసారి పూర్తి ఛార్జింగ్ చేస్తే సుమారు 60 కిలోమీటర్ల వరకు ప్రయాణించగల సామర్థ్యం ఈ సైకిళ్లకు ఉందని వెల్లడించారు.
ఈ రికార్డు స్థాయి పంపిణీ కార్యక్రమానికి ముందు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్వయంగా శివపురం గ్రామం నుండి తుమ్సి గ్రామంలోని ‘ప్రజా వేదిక’ సభా ప్రాంగణం వరకు ఈ-సైకిల్ ర్యాలీ నిర్వహించి ఉత్సాహాన్ని నింపారు.

