ఆంధ్ర ప్రదేశ్ లో పెన్షన్ల పంపిణీలో ‘అధికార’ ముద్ర పడింది. రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్ల అవతారం ఎత్తిన టీడీపీ
నేతలు పెన్షన్ల పంపిణీ క్రమంలో పలువురికి పెన్షన్లు ఇవ్వకుండా అధికారుల్ని అడ్డుకున్నారు.
వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులని చెప్పి ఏళ్ల తరబడి వస్తున్న
పింఛన్‌ను ఇప్పుడు ఇవ్వకపోవడంతో బాధితులు నిరసన తెలుపుతున్నారు.
శ్రీసత్యసాయి జిల్లా బత్తలపల్లి మండలం మాల్యవంతం పంచాయతీ పరిధిలో 40 మందికి
పింఛన్ ఇవ్వకుండా టీడీపీ నేతలు అడ్డుకున్నారు. దీంతో వారు బుధవారం
వైఎస్సార్‌సీపీ నాయకులతో కలసి ఎంపీడీవో కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. అయితే అధికారులు మాత్రం ప్రస్తుతానికి వెబ్ సైట్ క్లోజ్ అయింది అని, వచ్చేనెల రెండునెలల
పింఛన్ మొత్తాన్ని ఇస్తామని చెప్పారు. అప్పుడు కూడా ఇస్తారన్న గ్యారెంటీ
ఏమిటని వైఎస్సార్‌సీపీ నాయకులు నిలదీశారు. తామేమీ చేయలేమని అధికారులు
చేతులెత్తేశారు. దీంతో కలెక్టర్‌ను కలవాలని బాధితులు నిర్ణయించుకున్నారు.
ఇంకా అనేక చోట్ల ఇలాగే జరిగింది..
గాండ్లపెంట మండలం ఎలుగూటివారిపల్లిలో దివ్యాంగులైన నలుగురు లబ్ధిదారులకు
పింఛన్ మంజూరైనా అధికారులు పంపిణీ చేయలేదు.
స్థానిక టీడీపీ నాయకులను కలిసి వస్తేనే పింఛన్ ఇస్తామంటూ మూడురోజుల నుంచి
తిప్పుకొన్న సచివాలయ సిబ్బంది చివరకు సైట్ క్లోజ్ అయిందంటూ పింఛన్
సొమ్ము ఎగ్గొట్టారని రామగిరి మండలం ఎంసీపల్లి 1, 2 సచివాలయాలకు చెందిన
పెన్షన్‌దారులు బుధవారం పుట్టపర్తిలోని శ్రీసత్యసాయి జిల్లా కలెక్టర్
కార్యాలయం వద్ద బైఠాయించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
గతంలో ఏ రోజూ ఇలా జరగలేదని, వలంటీర్లు ఇంటికే వచ్చి పింఛన్ మొత్తాన్ని
ఇచ్చేవారని చెప్పారు.
కాకినాడ
జిల్లా కోటనందూరు మండలం ఎల్డీపేటలో 18 మంది పింఛనుదారులకు అధికారులు
పింఛన్ నిలిపేశారు. సోమ, మంగళవారాల్లో లబ్ధిదారుల ఇంటికి తెచ్చి
ఇవ్వాల్సిన పింఛన్ ఇవ్వకపోగా సచివాలయానికి వెళ్లినా పట్టించుకోలేదు.
మంగళవారం రాత్రి ఏడుగంటల వరకు సచివాలయంలోనే ఉన్నామని, ఎందుకు ఆపేశారని
అడిగినా అధికారులు సమాధానం చెప్పలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.
పెన్షన్ల పంపిణీలో రాజకీయ జోక్యం పట్ల పలువురు ఆందోళన చెందుతున్నారు..