ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ తొలి సమావేశం ముగిసింది. ఇవాళ సమావేశమైన కూటమి తొలి కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. సుమారు మూడున్నర
గంటలపాటు జరిగిన కేబినెట్ భేటీలో పలు కీలక అంశాలు చర్చకు వచ్చాయి.
చంద్రబాబు తొలి సంతకాలు చేసిన తొలి ఐదు సంతకాలపై వేర్వేరుగా చర్చ జరిపిన మంత్రివర్గ
పచ్చజెండా ఊపింది. అలాగే వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును ఎన్టీఆర్
హెల్త్ యూనివర్సిటీగా మార్చాలనే ప్రతిపాదనకు కూడా ఆమోదం తెలిపింది. అలాగే మెగా
డీఎస్సీ, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, సామాజిక భద్రతా పింఛన్లు
రూ.4000లకు పెంపు, అన్న క్యాంటీన్ల ఏర్పాటు, నైపుణ్య గణనలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
మెగా డీఎస్సీ కింద 16,437 పోస్టులను డిసెంబర్ పదో తేదీలోపు
భర్తి చేయనున్నారు. ఇందుకోసం జులై ఒకటి నుంచి ప్రక్రియ ప్రారంభం కానుంది.
అలాగే సామాజిక భద్రతా పింఛన్లు రూ. నాలుగువేలకు పెంచారు. జులై నెలలో
ఏప్రిల్, మే, జూన్ నెల బకాయిలు మూడు వేలు కలిపి మొత్తం రూ,7000 పింఛన్
అందివ్వనున్నారు. అలాగే వైఎస్ఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయానికి ఎన్టీఆర్
ఆరోగ్య విశ్వవిద్యాలయంగా పేరు మార్చాలని మంత్రివర్గం నిర్ణయించింది.
ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును వైసీపీ ప్రభుత్వ హయాంలో వైఎస్ఆర్
ఆరోగ్య విశ్వవిద్యాలయంగా మార్చారు. అయితే అధికారంలోకి వచ్చిన టీడీపీ కూటమి
ప్రభుత్వం ఎన్టీఆర్ పేరును పునరుద్ధరించాలని నిర్ణయం తీసుకుంది.
మరోవైపు
కేబినెట్ భేటీ తర్వాత మంత్రులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విడిగా కూడా సమావేశం
అయ్యారు. ఈ సారి మంత్రివర్గంలో 17 మంది తొలిసారిగా మంత్రులుగా బాధ్యతలు
స్వీకరించారు. అందులోనూ తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచినవాళ్లే ఎక్కువగా
ఉన్నారు. ఈ నేపథ్యంలో శాఖల నిర్వహణ, ప్రభుత్వ ప్రాధాన్యాలపై సీఎం చంద్రబాబు
వారికి వివరించినట్లు తెలిసింది.