న్యూఢిల్లీ: ఇంధన పొదుపు మరియు పర్యావరణ పరిరక్షణ దిశగా ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు, రాజధానిలో ఇంధన వినియోగాన్ని తగ్గించేందుకు వినూత్నమైన ‘పొదుపు చర్యలను’ ఆమె ప్రకటించారు. ఈ క్రమంలో ప్రభుత్వ ఉద్యోగులకు వారానికి రెండు రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్ (WFH) సౌకర్యాన్ని కల్పించడంతో పాటు, ప్రతి సోమవారం ‘నో వెహికల్ డే’గా పాటించాలని ఆదేశించారు.
ప్రభుత్వ కార్యాలయాల్లో సాధ్యమైన చోటల్లా ఉద్యోగులకు వారానికి రెండు రోజులు ఇంటి నుండే పనిచేసే వెసులుబాటు కల్పించనున్నారు. దీనివల్ల రవాణా ఖర్చులు తగ్గడమే కాకుండా ఇంధనం ఆదా అవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ప్రతి సోమవారం మంత్రులు, ఉన్నతాధికారులు తమ వ్యక్తిగత లేదా అధికారిక వాహనాలను పక్కన పెట్టి మెట్రో రైలులోనే ప్రయాణించాల్సి ఉంటుంది.
ప్రభుత్వ అధికారుల వాహనాలకు కేటాయించే పెట్రోల్, డీజిల్ పరిమితిని (Quota) 20 శాతం మేర తగ్గించారు. గతంలో 200-250 లీటర్లు ఉన్న కోటాను ఇప్పుడు 160-200 లీటర్లకు పరిమితం చేశారు. రాబోయే ఆరు నెలల కాలంలో ఢిల్లీ ప్రభుత్వం ఎలాంటి కొత్త వాహనాలను కొనుగోలు చేయదు.
ముఖ్యమంత్రి రేఖా గుప్తా స్వయంగా ఆదర్శంగా నిలిచేందుకు తన అధికారిక కాన్వాయ్‌లోని వాహనాల సంఖ్యను 60% తగ్గించుకున్నారు. ప్రస్తుతం కేవలం నాలుగు వాహనాలను మాత్రమే వాడుతున్నారు, అందులో రెండు ఎలక్ట్రిక్ వాహనాలు (EVs) ఉండటం విశేషం.



