తమిళనాడు పాలిటిక్స్‌లో బిగ్ ట్విస్ట్: ఏఎంఎంకే ఎమ్మెల్యే మద్దతుపై ‘వీడియో’ రిలీజ్ చేసిన విజయ్ పార్టీ

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే విషయంలో పొలిటికల్ హైడ్రామా కొనసాగుతోంది. తాజాగా దళపతి విజయ్‌ నేతృత్వంలోని తమిళగ వెట్రి కజగం (TVK) ...

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే విషయంలో పొలిటికల్ హైడ్రామా కొనసాగుతోంది. తాజాగా దళపతి విజయ్‌ నేతృత్వంలోని తమిళగ వెట్రి కజగం (TVK) సంచలన వీడియోను విడుదల చేసింది. అమ్మ మక్కల్ మున్నేట్ర కజగం (AMMK) పార్టీకి చెందిన ఎమ్మెల్యే కామరాజ్ స్వచ్ఛందంగా తమకు మద్దతు తెలుపుతూ లేఖ రాస్తున్న వీడియోను టీవీకే అధికారికంగా బయటపెట్టి తమిళ రాజకీయాల్లో వేడి రాజేసింది.

ఏఎంఎంకే అధినేత టీటీవీ దినకరన్ గవర్నర్‌ను కలిసి టీవీకేపై సంచలన ఆరోపణలు చేశారు. తమ పార్టీకి చెందిన ఏకైక ఎమ్మెల్యే కామరాజ్ పేరుతో టీవీకే పార్టీ ఒక ఫోర్జరీ మద్దతు లేఖను గవర్నర్‌కు సమర్పించిందని, వాస్తవానికి తాము అన్నాడీఎంకే (AIADMK) కు మద్దతు ఇస్తున్నామని ఫిర్యాదు చేశారు. ఈ ఆరోపణలతో రాష్ట్రంలో రాజకీయ ప్రకంపనలు రేగాయి.

దినకరన్ చేసిన ‘ఫోర్జరీ లేఖ’ ఆరోపణలను గట్టిగా తిప్పికొడుతూ.. ఎమ్మెల్యే కామరాజ్ స్వయంగా, చాలా సంతోషంగా టీవీకేకు మద్దతు లేఖ రాస్తున్న వీడియోను విజయ్ పార్టీ తాజాగా విడుదల చేసింది. “ప్రజలను తప్పుదోవ పట్టించేలా అసత్యాలు ప్రచారం చేస్తున్నారు. ఎమ్మెల్యే కామరాజ్ స్వచ్ఛందంగానే మాకు మద్దతు ఇస్తూ లేఖ రాశారు. ఇతరులతో బేరసారాలు ఆడాల్సిన అవసరం మాకు లేదు” అని టీవీకే ఒక ప్రకటనలో స్పష్టం చేసింది.

118 మ్యాజిక్ ఫిగర్ దిశగా..

మొత్తం 234 స్థానాలున్న తమిళనాడు అసెంబ్లీలో 108 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించిన టీవీకే.. మ్యాజిక్ ఫిగర్ (118) చేరుకోవడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. వామపక్షాలు (సీపీఐ, సీపీఎం), కాంగ్రెస్ ఇప్పటికే మద్దతు ప్రకటించగా, ఏఎంఎంకే ఎమ్మెల్యే కామరాజ్ మద్దతు టీవీకేకు అత్యంత కీలకంగా మారింది. ఈ వీడియో విడుదలతో దినకరన్ తదుపరి వ్యూహం ఎలా ఉండబోతోందనేది ఆసక్తికరంగా మారింది.

Join WhatsApp Channel