ఇరాన్‌తో యుద్ధం ముగింపు దశకు: ట్రంప్‌

వాషింగ్టన్‌: ఇరాన్‌పై సాగిస్తున్న సైనిక చర్యలను ముగించే దిశగా అడుగులు వేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించారు. మధ్యప్రాచ్యంలో తాము నిర్దేశించుకున్న లక్ష్యాల సాధనకు చేరువయ్యామని, ...

వాషింగ్టన్‌: ఇరాన్‌పై సాగిస్తున్న సైనిక చర్యలను ముగించే దిశగా అడుగులు వేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించారు. మధ్యప్రాచ్యంలో తాము నిర్దేశించుకున్న లక్ష్యాల సాధనకు చేరువయ్యామని, అందుకే యుద్ధాన్ని క్రమంగా తగ్గించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. తన సోషల్ మీడియా వేదిక ‘ట్రూత్ సోషల్’ ద్వారా ట్రంప్ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.

అక్కడ పహారా ఇతర దేశాల బాధ్యతే..

ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన ‘హోర్ముజ్ జలసంధి’ (Hormuz Strait) రక్షణ బాధ్యతను ఇకపై ఇతర దేశాలే చూసుకోవాలని ట్రంప్ స్పష్టం చేశారు. ఆ మార్గాన్ని ఉపయోగించుకునే దేశాలే అక్కడ భద్రతను, పర్యవేక్షణను చేపట్టాలని.. అమెరికా మాత్రం ఇకపై ఆ బాధ్యత తీసుకోదని ఆయన తేల్చిచెప్పారు. అవసరమైతే ఆయా దేశాలకు సహాయం అందిస్తాం తప్ప, ఇరాన్ ముప్పు తొలగిపోయిన తర్వాత అమెరికా అక్కడ ఉండాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.

కాల్పుల విరమణ ప్రసక్తే లేదు

యుద్ధం ముగింపు దశకు వస్తోందని చెబుతూనే.. కాల్పుల విరమణ ప్రతిపాదనను ట్రంప్ తోసిపుచ్చారు. “మరో పక్క శత్రువును పూర్తిగా తుడిచిపెడుతున్నప్పుడు.. కాల్పుల విరమణ అనే మాటకు తావులేదు” అని ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు. మరోవైపు, ఇరాన్‌పై మరిన్ని దాడులు చేసేందుకు తమ దేశంలోని సైనిక స్థావరాలను వాడుకునేందుకు బ్రిటన్ అనుమతించడంపై స్పందిస్తూ.. ఆ నిర్ణయం చాలా ఆలస్యంగా తీసుకున్నారని ట్రంప్ విమర్శించారు.

భూతల దళాల పంపకంపై పెంటగాన్ కసరత్తు?

ఇదిలా ఉండగా, ఇరాన్‌లోకి భూతల దళాలను పంపే అంశంపై పెంటగాన్ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఒకవేళ సైన్యాన్ని రంగంలోకి దించితే, ఇరాన్ సైనికులను బంధీలుగా పట్టుకోవడం వంటి అంశాలపై కూడా కసరత్తు జరుగుతున్నట్లు సమాచారం. గడిచిన రాత్రి కూడా ఇరాన్ రాజధాని టెహ్రాన్, లెబనాన్ రాజధాని బీరూట్‌లపై ఇజ్రాయెల్ భారీగా దాడులు జరిపింది. డ్రోన్లు, క్షిపణులను అడ్డుకున్నట్లు ఇజ్రాయెల్, సౌదీ అరేబియా ప్రకటించాయి. ఈ పరిణామాల నేపథ్యంలో మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.

Join WhatsApp Channel