బ్యాంకాక్: థాయిలాండ్‌లోని నఖోన్ రాట్చాసిమా ప్రావిన్స్‌లో బుధవారం ఉదయం భీకర రైలు ప్రమాదం జరిగింది. నిర్మాణ పనుల్లో ఉన్న ఒక భారీ క్రేన్ ఒక్కసారిగా ప్యాసెంజర్ రైలుపై కుప్పకూలడంతో భారీ ప్రాణనష్టం సంభవించింది.
స్థానిక కాలమానం ప్రకారం బుధవారం ఉదయం సుమారు 9:00 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. రాజధాని బ్యాంకాక్ నుండి ఉబోన్ రాట్చాథాని ప్రావిన్స్‌కు వెళ్తున్న ఒక ప్యాసెంజర్ రైలు, సిఖియో జిల్లా మీదుగా వెళ్తుండగా ఈ ప్రమాదానికి గురైంది.
ప్రస్తుతం ఉన్న రైల్వే ట్రాక్‌కు పైన ఎలివేటెడ్ హైస్పీడ్ రైలు మార్గం నిర్మిస్తున్నారు. ఈ నిర్మాణ పనుల్లో భాగంగా ఉపయోగిస్తున్న భారీ క్రేన్ అదుపు తప్పి కింద వెళ్తున్న రైలులోని మూడు బోగీలపై పడింది. క్రేన్ పడిన వేగానికి ఒక బోగీ నిలువుగా రెండు ముక్కలైపోయింది. ప్రమాదం జరిగిన వెంటనే రైలు పట్టాలు తప్పి, స్వల్పంగా మంటలు చెలరేగాయి.
నిర్మాణంలో ఉన్న హైస్పీడ్ రైలు ప్రాజెక్టుకు సంబంధించిన భారీ క్రేన్ కదులుతున్న ప్యాసెంజర్ రైలుపై పడటంతో ఈ పెను ప్రమాదం చోటుచేసుకుంది. తాజా సమాచారం ప్రకారం, ఈ ఘటనలో కనీసం 22 మంది మృతి చెందగా, మరో 80 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు.

