Modi Calls Putin: పుతిన్ కు ఫోన్ చేసిన మోడీ… తాజా పరిణామాలపై సంభాషణ

భారత్‌పై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ భారీగా సుంకాలు విధించిన నేపధ్యంలో ఈరోజు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ కు ప్రధాని మోదీ ఫోన్‌ చేశారు. ఈ విషయమై మోడీ ఎక్స్ లో పోస్ట్ చేసారు. రష్యాతో వ్యూహాత్మక భాగస్వామ్యం విషయంలో భారత్‌ కట్టుబడి ఉందని ఈ సందర్భంగా ఆయన ఎక్స్ ద్వారా తెలియజేశారు.

ఈ తాజా సంభాషణలో ఇరువురు నేతలు భారత్‌-రష్యాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల పటిష్టతపై చర్చించారు. ఇరుదేశాల మధ్య ప్రత్యేక, వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడంపై ఇరువురు నేతలు తమ నిబద్ధతను చాటుకున్నట్లు తెలిసింది. ఈ ఏడాది చివరలో 23వ భారత్‌-రష్యా వార్షిక సమావేశం జరుగనున్న విషయం తెలిసిందే.. అప్పుడు భారత్‌లో పర్యటించాలని పుతిన్‌కు ప్రధాని మోదీ ఆహ్వానించినట్లు పీఎంవో వెల్లడించింది.

మోడీ తన ట్వీట్ లో ‘నా స్నేహితుడు అధ్యక్షుడు పుతిన్‌తో చాలా మంచి, వివరణాత్మక సంభాషణ జరిగింది. ఉక్రెయిన్‌పై తాజా పరిణామాలను పంచుకున్నందుకు నేను ఆయనకు కృతజ్ఞతలు తెలిపాను. మా ద్వైపాక్షిక బంధంలో పురోగతిని కూడా మేము సమీక్షించాము. భారత్-రష్యా వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింతగా పెంచుకోవాలనే మా నిబద్ధతను పునరుద్ఘాటించాము. ఈ సంవత్సరం చివర్లో భారతదేశంలో అధ్యక్షుడు పుతిన్‌కు ఆతిథ్యం ఇవ్వడానికి నేను ఎదురు చూస్తున్నాను.’ అని వెల్లడించారు.

భారత్ లాగానే ట్రంప్ ఆంక్షల బారిన పడ్డ బ్రెజిల్ అధ్యక్షుడు నిన్ననే మోడీకి పోన్ చేసారు. ఈ సందర్భంగా వారు తమ ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై చర్చించారు.

Join WhatsApp Channel