నాలుగు దశాబ్దాలుగా ఇరాన్‌ను ఇనుప పిడికిలితో పాలిస్తున్న ఇస్లామిక్ రిపబ్లిక్ (ముల్లాల పాలన) పునాదులు కంపిస్తున్నాయి. 2026 జనవరిలో ప్రారంభమైన ఈ నిరసనలు కేవలం ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలు కావని, ఇది ఒక “సంపూర్ణ విప్లవం” దిశగా వెళ్తోందని అంతర్జాతీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఇరాన్‌లో నెలకొన్న పరిస్థితులు ముల్లాల పాలనకు చరమగీతం పాడేలా ఉన్నాయా? అంటే ‘అవును’ అనే సమాధానమే వినిపిస్తోంది.
గతంలో 2009, 2019, 2022లో కూడా ఇరాన్‌లో నిరసనలు వచ్చాయి. కానీ, ప్రస్తుత పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది. గతంలో నిరసనలకు బలమైన నాయకత్వం లేదు. కానీ ఇప్పుడు బహిష్కృత ఇరాన్ యువరాజు రెజా పహ్లావీ ఈ ఉద్యమానికి పరోక్ష నాయకత్వం వహిస్తున్నారు. “నేను ఇరాన్ తిరిగి రావడానికి సిద్ధంగా ఉన్నాను, సైన్యం ప్రజల పక్షం వహించాలి” అని ఆయన ఇచ్చిన పిలుపు ప్రజల్లో కొత్త ఆశలు రేకెత్తించింది. ప్రభుత్వ భద్రతా దళాలు విచక్షణారహితంగా కాల్పులు జరుపుతున్నా, ప్రజలు వెనక్కి తగ్గడం లేదు. ప్రాణాలకు తెగించి “ఖమేనీకి మరణం” అనే నినాదాలతో రోడ్లమీదకు వస్తున్నారు. ఇరాన్ కరెన్సీ విలువ దారుణంగా పడిపోయింది. పేదరికం, నిరుద్యోగం తారాస్థాయికి చేరాయి. ప్రజలకు పోగొట్టుకోవడానికి ఏమీ లేకపోవడంతో, ప్రభుత్వ కూల్చివేతే ఏకైక మార్గంగా ఎంచుకున్నారు.
అమెరికా ‘స్ట్రాంగ్’ వార్నింగ్
ఇరాన్ వ్యవహారాల్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జోక్యం చేసుకోవడం ముల్లాల గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తోంది. “ఇరాన్ ప్రజలను చంపితే చూస్తూ ఊరుకోం.. మా సాయం వస్తోంది (Help is on its way)” అని ట్రంప్ చేసిన హెచ్చరిక నిరసనకారులకు కొండంత బలాన్ని ఇచ్చింది. ట్రంప్ వ్యాఖ్యలు కేవలం మాటలకే పరిమితం కావని, అవసరమైతే సైనిక పరమైన ఒత్తిడి కూడా ఉండవచ్చని ఇరాన్ పాలకులు భయపడుతున్నారు.
అంతర్గత కుమ్ములాటలు?
ఇరాన్ సైన్యం మరియు రివల్యూషనరీ గార్డ్స్ మధ్య అంతర్గత విభేదాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కొంతమంది సైనికులు ప్రజలపై కాల్పులు జరపడానికి నిరాకరిస్తున్నారని, ఇది ప్రభుత్వ పతనానికి నాంది అని ఇంటెలిజెన్స్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ పరిస్థితిని చక్కదిద్దడానికి ప్రభుత్వం విదేశీ మిలీషియాలను రప్పించిందన్న వార్తలు ప్రజాగ్రహాన్ని మరింత పెంచాయి.
ముల్లాల పాలన అంతం సాధ్యమేనా?
ప్రస్తుతానికి ఇరాన్ ప్రభుత్వం ఇంటర్నెట్‌ను బంద్ చేసి, మీడియాను నియంత్రించి, మారణకాండ ద్వారా పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తోంది. అయితే ఇరాన్‌లో ప్రస్తుతం జరుగుతున్నది కేవలం నిరసనలు కాదు, అది ఒక స్వేచ్ఛా పోరాటం. 2026 ఇరాన్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలుకుతుందని… ముల్లాల పాలన రేపో మాపో కూలిపోకపోవచ్చని అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు ఖచ్చితంగా చెపుతున్నారు.

