ఉన్నావో అత్యాచార బాధితురాలి పోరాటం మరోసారి గెలిచింది. తన కుమార్తె పెళ్లి కోసం రాజకీయ పలుకుబడిని ఉపయోగించి బయటకు రావాలని చూసిన కుల్దీప్ సెంగార్ ప్రయత్నాలకు సుప్రీంకోర్టు అడ్డుకట్ట వేసింది. జీవిత ఖైదు అనుభవిస్తున్న మాజీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్కు లభించిన మధ్యంతర బెయిల్‌పై అత్యున్నత న్యాయస్థానం స్టే విధిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.
ఢిల్లీ హైకోర్టు ఇటీవల సెంగార్ కుమార్తె వివాహం నిమిత్తం ఆయనకు రెండు వారాల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అయితే, ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ బాధితురాలు సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సెంగార్ బయటకు వస్తే తన ప్రాణాలకు ముప్పు ఉందని, సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని ఆమె కోర్టుకు విన్నవించింది. ఈ వాదనలతో ఏకీభవించిన సుప్రీంకోర్టు ధర్మాసనం, హైకోర్టు ఉత్తర్వులపై స్టే విధిస్తూ తదుపరి విచారణను వాయిదా వేసింది.
2017లో ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావోలో ఒక మైనర్ బాలికపై అప్పటి బిజెపి ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.2019 డిసెంబర్ లో ఢిల్లీలోని తీస్ హజారీ కోర్టు సెంగార్‌ను దోషిగా నిర్ధారిస్తూ ‘జీవిత ఖైదు’ విధించింది. బాధితురాలికి ₹25 లక్షల పరిహారం చెల్లించాలని కూడా కోర్టు ఆదేశించింది.
ఈ కేసు విచారణ సమయంలో బాధితురాలి కుటుంబం అనేక ఇబ్బందులు ఎదుర్కొంది. బాధితురాలి తండ్రి పోలీస్ కస్టడీలో మరణించడం, ఆ తర్వాత బాధితురాలు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురై ఆమె బంధువులు మరణించడం వంటి ఘటనలు సెంగార్ అరాచకాలకు అద్దం పట్టాయి. ఈ నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకునే సుప్రీంకోర్టు ఆయనకు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది.

